మోసపోతే గోసపడ్తం

– రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శం
– తెలంగాణలో ఎకరా అమ్మితే.. ఆంధ్రాలో పదెకరాలు
– అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ ఆశీర్వదించండి
– చిమ్మ చీకటైతదన్నరు..వెలుగులు జిగేల్‌మంటున్నయి
– పటాన్‌చెరులో రెవెన్యూ డివిజన్‌, పాలిటెక్నిక్‌ మంజూరు
– కొల్లాపూర్‌లో ‘డబుల్‌’ ఇండ్ల ప్రారంభం
– పటాన్‌చెరువులో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి
సీఎం కేసీఆర్‌ భూమిపూజ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘మోసపోతే గోసపడ్తం.. కొనసాగుతున్న రాష్ట్ర ప్రగతి రాబోయే రోజుల్లోనూ కొనసాగాలంటే ప్రజలు మళ్లీ దీవించాలి.. మనం కడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. మనం ఇస్తున్న ఇంటింటికీ మంచినీళ్లు దేశంలో ఎక్కడా లేవు. చిమ్మ చీకటైతది మీకు కరెంట్‌ రాదన్నారు. కానీ నేడు విద్యుత్‌ వినియోగంలో మనమే దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. ప్రగతి పథంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా ఉంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్మించిన 1660 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. మేథా రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం పటాన్‌చెరులో రూ.200 కోట్లతో నిర్మించనున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాల భూమి వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పదెకరాలు వస్తుందని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నాడని గుర్తు చేశారు. ప్రశాంతమైన జీవన విధానం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్నారు. అమరుల త్యాగ ఫలం చాలా గొప్పదని, వారి ఆకాంక్షలు నెరవేర్చడమే నిజమైన నివాళి అని అన్నారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు పటాన్‌చెరు నియోజకవర్గంలో గల్లి గల్లీలో పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరులో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవల్ని అందించే లక్ష్యంతో రూ.200 కోట్ల వ్యయంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించుకోవడం శుభపరిణామమన్నారు. ఆస్పత్రి నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకోవాలని సూచించారు. హరీశ్‌రావు హయాంలో వైద్యరంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. పెరుగుతున్న రవాణా అవసరాల రీత్యా హయత్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో లైన్‌ విస్తరించాల్సిన అవసరముందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రిమండలి సమావేశంలోనే పటాన్‌చెరు వరకు మెట్రోలైన్‌ విస్తరణ పనుల మంజూరుకు సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అనేకసార్లు కలిసి విన్నవించారని, ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కొల్లూరు ప్రాంతంలో ఐటీ పార్కు పెట్టేందుకు మంత్రి కేటీఆర్‌ను పంపిస్తానని, దారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అవసరాలు పెరిగినందున వివిధ అభివృద్ధి పనుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మూడు మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.30 కోట్ల చొప్పున, మూడు కార్పొరేషన్‌ డివిజన్లకుగాను ఒక్కోదానికి రూ.10 కోట్లు, నియోజకవర్గంలో ఉన్న 55 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కోదానికి రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా రెవెన్యూ డివిజన్‌తో పాటు పాలిటెక్నిక్‌ కళాశాలను, రామసముద్రం చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అన్నట్టుగా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ ఇవ్వడం వల్ల పటాన్‌చెరు ప్రాంతంలో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయన్నారు. కార్మికులకు పని లభించడం వల్ల ఆదాయం కూడా పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కరెంట్‌ కోతల వల్ల నడిచేవి కావని గుర్తు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలో నెంబర్‌ వన్‌గా ఎదుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌ శర్మ, ఎంపీలు బీబీపాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్యరావు, చంటిక్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌ రెడ్డి, రాష్ట్ర వైద్య సేవల, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మహిళా కమిషన్‌ చైర్మెన్‌ సునీతాలక్ష్మారెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ చింత ప్రభాకర్‌, గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ సాయిచంద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ పట్నం మాణిక్యం పాల్గొన్నారు.

Spread the love