కొనబోతే బెదురు…తినబోతే అదురు

If you want to buy bamboo, if you want to eat it, you will eat bamboo– అధిక వర్షాలు, దిగుమతులు తగ్గడమే కారణం
– ఆకాశాన్నంటుతున్న వంట నూనెల ధరలు
– నెల రోజుల్లో లీటర్‌కు రూ.30 నుంచి 40 పెరుగుదల
– క్రమంగా తగ్గుతున్న నూనె గింజల సాగు
– ప్రోత్సాహం లేక ఆసక్తి చూపని రైతన్న
– బియ్యం, కూరగాయల ధరలూ పైపైకి
– సామాన్యులపై మోయలేని భారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పెరుగుతున్న వంట నూనెల ధరలు వినియోగదారులకు బిగ్‌షాక్‌ ఇస్తున్నాయి. పెరిగిన ధరలతో వినియోగదారుడి పరిస్థితి ‘కొనబోతే బెదురు…తినాలంటే అదురు’ అనేలా తయారైంది. గత కొంత కాలంగా స్థిరంగా ఉన్న నూనెల ధరలు ఉన్నట్టుండి పెరగడం పట్ల వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. వంట నూనెలతోపాటు పప్పులు, బియ్యం, కూరగాయల ధరలూ ఆకాశానికి నిచ్చెనలే స్తున్నాయి. ఈ నేపథ్యంలో ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వమే ముడి, రిఫైన్డ్‌ వంట నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం పెంచింది. దీంతో వ్యాపార వర్గాలు ఇతర దేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించాయి. ఈ పరిణామంతో వినియోగానికి సరిపడినంత వంట నూనెలు రావడం లేదు. దీంతో లీటర్‌ వంట నూనె ధర రూ 30 నుంచి రూ. 40 వరకు పెరిగింది. సన్‌ఫ్లవర్‌ లీటర్‌కు రూ.115 నుంచి రూ.140 వరకు, పామాయిల్‌ ధర లీటర్‌కు రూ. 115 నుంచి రూ.125కు చేరుకుంది. మధ్యవర్తులు, డిస్ట్రిబ్యూటర్లు పది లీటర్ల నూనె డబ్బాను రూ 1300 నుంచి రూ.2000కు పెంచినట్టు వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాలకు నూనె గింజల పంటలు దెబ్బతిని ఉత్పత్తికి నోచుకోవడం లేదు. వంటనూనెల వ్యాపారులు నో స్టాక్‌ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వీటన్నింటి కారణంగా వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి నెలకు మూడు లేదా నాలుగు లీటర్ల నూనె పడుతున్నది. పెరిగిన ధరల ప్రకారం లీటర్‌కు రూ. 30 పెరిగితే నాలుగు లీటర్లకు రూ.120 అవుతున్నది. ఈలెక్క ప్రకారం నూనె ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏడాదికి రూ. 1440ల అదనపు భారం పడుతున్నది. ప్రజల ఆదాయాలేమో గొర్రె తొక బెత్తెడు అన్న చందంగా ఉన్నాయి. పెరుగుతున్న ధరల భారం సామాన్య, మధ్య తరగతి వర్గాలను తీవ్రంగా కుంగదీస్తున్నాయి.
నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహమేది?
రాష్ట్రంలో కోటి 50 ఎకరాల సాగు భూమి ఉన్నట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో కోటి 20 ఎకరాల్లో వరి, పత్తి సాగవుతున్నది. ఇంకా మిగిలింది 30 లక్షల ఎకరాలే. మొక్కజొన్న, జొన్న, పప్పులు, పండ్లు, కూరగాయల తోటలు పోను మిగిలిన నేలల్లో వంట నూనెలు సాగవుతున్నాయి. పల్లీలు, సన్‌ఫ్లవర్‌, నువ్వులు, ఆముదాలు, కుసుమ, పామాయిల్‌ నుంచి వంట నూనెలు ఉత్పత్తి అవుతాయి. కుసుమ, ఆదాముల పంట దాదాపు కనుమరుగైనట్టు కనిపిస్తున్నది.
సన్‌ఫ్లవర్‌, నువ్వులు చాలా స్వల్పంగా సాగవుతున్నాయి. అయితే వానాకాలం నూనె గింజల పంట సాగుకు అనుకూలంగా ఉండదు. కేవలం యాసంగి సీజన్‌లో మాత్రమే ఆ పంటలకు వాతావరణం అనువుగా ఉంటుంది. కానీ వరి సాగు విస్తరించడంతో నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం తగ్గి పోయింది. ఫలితంగా దాని ప్రభావం వంట నూనెల ధరలపై పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా పంటలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించక పోవడంతో రైతులు వాణిజ్య పంటలు, వరి ధాన్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలకు బాధ్యత లేదా?
నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ధరలు ఎంత పెంచినా అడిగే వారే లేరు. వ్యాపారులు ఇష్టమొచ్చినంత ధరను పెంచుకోవచ్చు. డిమాండ్‌, సప్లరు ఆధారంగా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుకోవచ్చు. ఈ విషయంలో మార్కెటింగ్‌ శాఖ తమకేవిూ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కేవలం పండిన పంటను కొనడం, అమ్మడం తప్ప మార్కెట్లో ధరల పరిస్థితులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఎంత? ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరం? కూరగాయల ఉత్పత్తి ఎంత? పప్పులు, నూనె గింజల ఉత్పత్తి ఎంత? రాష్ట్రానికి ఏదీ ఎంత అవసరముంది? ఇంకా ఎంత ఉత్పత్తి కావాల్సి ఉంది? ఇలాంటి లెక్కలు ప్రభుత్వాలు తీయడం లేదు. పౌరసరఫరాల శాఖ గత పదేండ్లుగా కేవలం బియ్యం సరఫరా చేసే సంస్థగా మారింది. పప్పులు, వంట నూనెలు, కూరగాయల పంపిణీ విషయంలో తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీంతో వ్యాపారులకు కాసుల పంట పండుతున్నది.

Spread the love