– పోలీసుల డైరెక్షన్‌లోనే కౌశిక్‌రెడ్డిపై దాడి :
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇల్లు పరిశీలన
– ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్
నవతెలంగాణ-మియాపూర్
తొమ్మిది నెలల సీఎం రేవంత్‌రెడ్డి పాలన అసమర్థుడి జీవన యాత్రలా సాగుతోందని, హామీల అమలు గురించి అడిగితే దాడులు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో దుష్ట సంస్కృతికి రేవంత్ తెరలేపారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే.. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అనుచరులు చేసిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తనను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రశ్నించిన ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరిపించిన దిక్కుమాలిన సీఎం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతగాక డిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 22 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన రోజే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మెన్ పదవి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. అదే విషయమై కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం లేక సహనం కోల్పోయి బజారు భాషతో బూతులు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇదే రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి’ అంటూ హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అయినా తాము ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి న్యాయ పోరాటం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. పోలీసుల డైరెక్షన్‌లోనే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ దృష్టిలో రేవంత్ చిట్టినాయుడితో సమానమని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు, ఇప్పుడూ ఉండబోవన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.