ప్రభుత్వ భూములపై ప్రజలదే హక్కు
– వందల ఎకరాలు ఆక్రమిస్తున్న వారిపై చర్యలేవి?
– దాడులు, అరెస్టులకు మేం భయపడం
– సాహెబ్ నగర్‌లో మహిళలపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి
– అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ-వనస్థలిపురం
గూడులేని పేదలు ఇండ్ల జాగాలు అడిగితే వారిపై జులుం ప్రదర్శించి మహిళలని కూడా చూడకుండా పోలీసు బలగాలతో దాడులు చేయించారని, ప్రభుత్వ భూములపై పేదోడికే హక్కు ఉందని, ఆ జాగాలు పేదలకు దక్కే వరకూ అరెస్టులు చేసి జైల్లో వేసినా భూ పోరాటాన్ని ఆపమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కాలనీలో ఇండ్ల జాగాలేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గూడిసెలు వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న నెపంతో పోలీసులు వారిపై శనివారం రాత్రి దాడి చేశారు. స్థానికులు, సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి జైల్‌కు పంపించారు. దీన్ని ఖండిస్తూ ఆదివారం వనస్థలిపురం పోలీసు సేష్టన్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు.. ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నం చేస్తే మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాల్సిందిపోయి వారిపై పోలీసు బలగాలను ఊసిగొల్పడం ఏమిటని ప్రశ్నించారు. అమాయకమైన ప్రజల ఇండ్లలో చొరబడి దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడులు చేయడం బాధాకరమని, ఈడ్చుకెళ్లి జైల్లో వేయడం పోలీసుల దమనకాండకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై దాడులు చేయిస్తున్న ప్రభుత్వం వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న భూ బకాసురులపై ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై కూడా ఇలా గే దాడులు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. రియల్ వ్యాపా రుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే సాహెబ్‌నగర్ కాలనీ వాసులపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టిన సీఐని సస్పెండ్ చేయాలని, మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. పోలీసుల కేసులు, రెవెన్యూ అధికారుల బెదిరింపులకు ఎర్ర జెండా భయపడబోదన్నారు. పోరాటా లు తమకు కొత్తేమీ కాదని, తమపై ఎన్ని నిర్బంధాలు విధించినా భూ పోరా టాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పేదలకు ఇండ్ల జాగలు దక్కే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇండ్లు లేని ప్రతి పేదోడీకి ఇంటి జాగాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 27 వరకు తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్ర రంగారెడ్డి జిల్లాలో కూడా కొనసాగుతుందని తెలిపారు.
పేదలపై అక్రమ కేసులు ఎత్తేయాలి…
మహిళలను వెంటనే విడుదల చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాయబ్‌నగర్‌లో అరెస్టు చేసినపేదలు, మహిళలను వెంటనే విడుదల చేయాలనీ, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిలో ఇండ్ల జాగాల కోసం పోరాడుతున్న పేదలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడంతో పాటు వారిని అరెస్టు చేసి అర్థరాత్రి జైలుకు పంపారని పేర్కొన్నారు. సాయబ్‌నగర్ సర్వే నెం.71లో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమిలో తమకు ఇండ్లస్థలాలు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది పేదలు ఉద్యమిస్తున్నారని తెలిపారు. జానెడు స్థలం కోసం పోరాడుతున్న పేదలపై స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసిప్రజాసంఘాల నేతలు, ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. వీరిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, సీపీఐ(ఎం) స్థానిక నాయకులు గణేష్ గౌడ్, తొమ్మిది మంది మహిళలతో కలిపి మొత్తం 19మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని దళితవాడ మీద పోలీసులు దాడి చేసి, స్థానికులతో పాటు మహిళలను తీవ్రంగా గాయపర్చారని తెలిపారు.. రాజు అనే వ్యక్తి చేయి విరిగి ఆస్పత్రి పాలయ్యాడని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేటు వ్యాపారులు ఆక్రమిస్తుంటే..పట్టించుకోని సర్కారు ఇండ్ల జాగాలు అడుగుతున్న పేదలపై కేసులు పెట్టటమేంటని ప్రశ్నించారు. పేదలపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాటు చేయటం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు.