టిక్కెట్‌ ఇస్తే ఓకే..! లేదంటే షాకే..!!

– ఎవరుంటారో.. ఎవరు పోతారో..?
– అయోమయంలో రాజకీయ పార్టీలు
– నేతల విశ్వసనీయతపై సందేహాలు
– అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం ఉత్తిమాటలే..!
– పూటకో పార్టీ మార్పుపై విమర్శలు
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఈ ఏడాది ఆరంభం నుంచే బలాబలాలు.. రాజకీయ సమీకరణాలపై దృష్టి సారిం చాయి. దీనిలో భాగంగా ఇటు నుంచి అటు, అటునుంచి ఇటు పార్టీల్లో నేతల చేరికలు ముమ్మరం అయ్యాయి. ఎన్నికలకు మరో మూడు నెలల మాత్రమే సమయం ఉండటంతో ఆశావహులు ఆయా పార్టీల్లో తమ అవకాశాలపై విశ్లేషణ చేసుకుంటున్నారు. టిక్కెట్‌ లభించే పరిస్థితి లేకుంటే మరో పార్టీలోకి జంప్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జంపింగ్‌ జపాంగ్‌ల సంఖ్య భవిష్యత్‌లో మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నేతలెవరైనా వారి పార్టీ మార్పు స్వీయప్రయోజనాల కోసమేనని సామాన్యులకు సైతం అర్థమవుతోంది. అయినా పార్టీ మారే క్రమంలో అభివృద్ధి లేదంటే కార్యకర్తల అభీష్టం.. సిద్ధాంతం అంటూ మాట్లాడటం పరిపాటిగా మారింది. తరచూ పార్టీలు మారుస్తున్న నేతలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రజాబలం లేని నేతలే ఇలా అడ్డగోలుగా పార్టీలు మారుస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన పొంగులేటి శిబిరం నేతల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారెవరూ ప్రభావితం చేసే నాయకులు కాదని విమర్శకుల విశ్లేషణ. ఆ కోవలోకి చెందిన నేతల్లో డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ఒకరని చెబుతున్నారు. ఇక మిగిలిన నేతల్లోనూ భద్రాద్రి జడ్పీ చైర్మెన్‌ కోరం కనకయ్య కూడా కాంగ్రెస్‌ను వీడతారనే వార్తలు వినిపించాయి. అయితే, కాంగ్రెస్‌ నుంచి తనను ఎదుర్కోలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులెవరినీ అసెంబ్లీ గేటు తాకనీయనని ప్రతినబూనిన పొంగులేటి శిబిరం ఆ దిశగానే పావులు కదుపుతోందని సమాచారం. టిక్కెట్ల విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న అంతర్గత సర్వే విధానంతో తనకు పొంగులేటి సైతం టిక్కెట్‌ ఇప్పించలేరని నిర్ధారణకు వచ్చే వెంకట్రావు పార్టీ వీడినట్టు తెలుస్తోంది. అంతర్గత సర్వేలో ముందున్న నేతలకే టిక్కెట్‌ దక్కే అవకాశం ఉండటంతో పొంగులేటి శిబిరం నుంచి మరికొందరు నేతలు కూడా జారుకునే చాన్స్‌ ఉంది.
సతీమణుల చేతుల్లో పతుల భవితవ్యం..
బీఆర్‌ఎస్‌ కూడా కొందరు నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సతీమణి నిర్ణయంపైనే కోరం కనకయ్య భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఆమె ప్రలోభాలకు గురైతే కోరం కూడా పార్టీ మారే అవకాశం ఉంది. సతీమణి కారణంగానే గత ఎన్నికల్లో పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు ఓటమి పాలయ్యారనే ప్రచారం ఉంది. గత కొంతకాలంగా ఆమెను రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంచుతున్నా నియోజకవర్గంలో పాయం గెలుపు అవకాశాలు మెరుగ్గా లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అశ్వారావుపేట నుంచి పోటీ చేయించాలని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడ ఆశావహునిగా ఉన్న తాటి వెంకటేశ్వర్లును కాదని పాయంకు టిక్కెట్‌ ఇస్తారా? లేదా? అనే సందేహాలున్నాయి. కారణాలేవైనా పూటకో పార్టీ మార్చే నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌, టీడీపీల తరఫున విజయం సాధించిన 9 మంది అభ్యర్థుల్లో భట్టి, పోడెం మాత్రమే కాంగ్రెస్‌ను వీడకుండా ఉన్నారు. మిగిలిన ఏడుగురు బీఆర్‌ఎస్‌లో చేరారు. రాబోయే ఎన్నికల్లో వీరిలో ఎందరిపై పార్టీ, ప్రజావిశ్వాసం ఉంటుందో చూడాల్సిందే.

Spread the love