ఆ బడ్జెట్‌తో 10 సినిమాలు తీస్తా..

–  ఆస్కార్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.80 కోట్ల బడ్జెట్‌
ఆస్కార్‌.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు. అయితే ఈ అవార్డుని సొంతం చేసుకోవాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు. కనీసం వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చెప్పకనే చెప్పింది. విదేశాల్లో ప్రమోషన్ల కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఇప్పటి వరకు దాదాపు 80 కోట్ల రూపాయలను వెచ్చించింది. అంతేకాదు టీమ్‌ మొత్తం మూడు నెలల విలువైన సమయాన్ని ప్రమోషన్ల కోసం కేటాయించింది. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’, ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌’ వంటి పురస్కారాలను దక్కించుకుని ఆస్కార్‌ బరిలో గట్టి పోటీలో ఉంది. ఈనెల 13న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆస్కార్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఖర్చు పెట్టిన బడ్జెట్‌తో కనీసం 10 సినిమాలు తీసి, ముఖాన కొడతానని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో దూమారం రేపుతున్నాయి. ఆస్కార్‌ వస్తే చరిత్రే.. రాకపోతే రూ.80 కోట్లు వృథా అయినట్టే కదా అని కొంతమంది వాదిస్తుంటే, తెలుగు సినిమా సత్తా విశ్వవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మరోమారు తెలిసింది. అంతేకాదు హాలీవుడ్‌ సంస్థలు మన సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తలుపులు తెరిచిందని మరికొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా వాదిస్తున్నారు.

Spread the love