– దేశగాయాలపై మౌనంగా ఉంటే రాచపుండుగా మారే ప్రమాదం
– కులం, మతం నాన్సెన్స్..విసర్జించాల్సిందే : సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూడాల్సింది వారి సర్కస్‌ను మాత్రమేనని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ‘దేహానికి గాయాలైతే మౌనంగా ఉన్నా కొద్ది కాలం తర్వాత మానిపోతాయి. దేశానికి తగులుతున్న గాయాలపై మౌనంగా ఉంటే అది రాచపుండు మాదిరిగా ప్రమాదకరంగా మారి కబళించివేస్తుంది. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సమూహ ఏర్పడటం మంచి పరిణామం. అందరూ మేల్కొని దేశాన్ని రక్షించుకోవాలి’ అని సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘సమాజం నేడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. కేవలం ప్రతిభ ఉంటేనే రచయితలు, కవులు కాలేరు. చంద్రుడు, పూలు, నక్షత్రాలు, ప్రకృతి మీద కవితలు రాయొచ్చు. కానీ, మనం వెళ్తున్న దారిలో రక్తం కనిపిస్తే దానిపైనా రాయాల్సిన బాధ్యత కూడా కవులపై ఉంది. వాటిని డాక్యుమెంట్ చేయాల్సిన అవసర మూ ఉంది’ అని నొక్కి చెప్పారు. ‘ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో నువ్వా? నేనా? అనే డిబేట్ కాంపిటేషన్ నడిచింది. అందులో రాజకీయం తప్ప వేరేదేం లేదు. వంద రోజులుగా మణిపూర్ మండిపోతున్నా మాట్లాడిందేం లేదు. మణిపూర్ గురించి ప్రస్తావిస్తే బెంగాల్, హర్యానా అంటూ అసలు విషయాన్ని దారిమళ్లించారు. హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టారు. సమావేశాల్లో పెద్దగా చెప్పుకోవడానికేం లేదు’ అని చెప్పారు. దేశంలో రైళ్లను ప్రారంభించుకుంటూ పోతున్న స్టేషన్ మాస్టర్‌ను మణిపూర్ వెళ్లే రైలు ఏ సమయానికి వస్తుందని అడిగితే సమాధానమే లేదన్నారు. జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూడాల్సింది వారి సర్కస్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. నేతలను ఎన్నుకునే విషయంలో ప్రజల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. మన బొటనవేలు తెగిపోతే ఏం కాదు..అదే ఏకలవ్యుడి బొటన వేలు తెగిపోతే అది సమాజానికి నష్టమనీ, అలా జరగ కుండా చూడాలని అన్నారు. 70 ఏండ్ల తర్వాత దేశం ఎక్క డున్నది? అసలేం జరుగుతున్నది? దానికి మూలకారణ మేంటి?ప్రజల్ని చైతన్యపర్చటానికి మనం చేయాల్సిందేంటి? అనే వాటిపై ప్రశ్నించే, ఆలోచించే సమయం వచ్చిందనీ, ముఖ్యంగా కళాకారులు, ప్రజ్ఞావంతులు, రచయితలపై ఆ బాధ్యత ఎక్కువగా ఉందని నొక్కి చెప్పారు. కులం, మతం నాన్సెన్స్ అని కొట్టిపడేశారు. మలం, కులం దేశానికి చాలా ప్రమాదకరమనీ, వాటిని విసర్జించాలని పిలుపునిచ్చారు.
నడిరోడ్డులో ఉన్నాం… పోరాడాల్సిందే : ప్రొఫెసర్ కాశీం
గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ ప్రకారం అన్ని వ్యవస్థల నూ నాశనం చేసుకుంటూ అధ్యక్షత తరహా పాలన తీసుకు రావడానికి కంకణం కట్టుకుని బీజేపీ ముందుకెళ్తున్నదనీ, వ్యవస్థల నిర్వీర్యంతో నడిరోడ్డున పడ్డాం. వెనక్కి వెళ్లలేం.. ముందుకెళ్లలేం…నిలబడ్డ చోటు నుంచే పోరాడాల్సిందేనని ప్రొఫెసర్ కాశీం పిలుపునిచ్చారు. ముస్లింలు, కమ్యూనిస్టు లు, అంబేద్కరిస్టులపై హిందూత్వ శక్తులు తప్పుడు ప్రచారా లకు పూనుకున్నాయన్నారు. రాజ్యాంగానికి ఆత్మలాంటి ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేస్తున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. సోషలిస్టు భావన అనే పేరు ఉండొద్దనే కారణంతో పంచవర్ష ప్రణాళికలను మోడీసర్కారు రద్దు చేసి నిటిఅయోగ్‌ను కేంద్రం తెచ్చిందని విమర్శించారు. శానస, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదన్నారు. మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని ముందుకెళ్తున్న తీరును వివరించారు. ఎన్సీఆర్టీ నుంచి చరిత్రకారులు, మేధావులను తీసేసి ఆర్ఎస్ఎస్ వాళ్లను నింపారన్నారు. యూజీసీ చైర్మెన్‌గా ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉన్నారన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలను టార్గెట్ చేశా రనీ, తెలంగాణ, ఏపీలకు చెందిన ఆర్ఎస్ఎస్ భావజాల మున్న నలుగురిని వీసీలుగా, 80 మందిని ప్రొఫెసర్లుగా నియమించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అంశం తెరపైకి : ప్రొఫెసర్ పద్మజా షా
ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందటం బీజేపీకి అలవాటుగా మారిందని ప్రొఫెసర్ పద్మజా షా విమర్శించారు. గత ఎన్నికల్లో రామమందిరం, త్రిబుల్ తలాక్‌ను తీసుకొచ్చారనీ, ఈ ఎన్నికల ముందు కామన్ సివిల్ కోడ్‌ను ఎత్తుకున్నారని వివరించారు. 21వ లా కమిషన్ ఆ కోడ్ అవసరం లేదని చెబితే..దాన్ని మార్చేసి కొత్త లా కమిషన్ వేస్తున్నారని తెలిపారు. కామన్ సివిల్ కోడ్‌ను హిందూ-ముస్లిం సమస్యగా సృష్టించారని విమర్శించారు. ముస్లిం మతంలోనే దాష్టికాలున్నాయనీ, హిందూ మతంలో అన్నీ మంచే ఉన్నాయని చెప్పే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ముస్లింలపై పదేపదే చర్చ పెడుతున్న కార్పొరేట్ మీడియా హిందూ మతంలో మూఢనమ్మకాలను, దురాచారాలను ఎందుకు ఎత్తిచూపడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే మీడియా గొంతుకలను మోడీ సర్కారు నొక్కివేస్తున్నదనీ, పత్రికా స్వేచ్ఛలో మన దేశం ఆప్ఘనిస్థాన్ కంటే దిగువ స్థాయిలో ఉందని చెప్పారు.
ఆలోచన..అక్షరం..రచన సమాజాన్నే మారుస్తాయి : ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ఆలోచన..అక్షరం..మంచి రచన సమాజాన్నే మార్చేస్తాయని ప్రొఫెసర్ భంగ్యా భూక్యా తెలిపారు. ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడనే నెపంతో గ్రాంసీని ముస్సోలిని ప్రభుత్వం జైల్లో పెట్టిందనీ, ఆయన అక్కడ నుంచీ తన రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారన్నారు. ‘సమాజాన్ని మార్చే గ్రాంసీ మెదడు ప్రమాదకరం, ఆలోచనలు మిగులొద్దు అని గ్రాంసీ చంపేశారు’ అని చెప్పారు. నేడు మన దేశంలోనూ అదే జరుగుతున్నదనీ, ప్రశ్నించే కవులు, రచయితలను చంపేస్తున్నారనీ, ఉపా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. దోపిడీ ఎక్కువ జరిగే దేశంలోనే శతకోటీశ్వర్లు సంఖ్య ఎక్కువగా ఉంటుందనీ, అందుకే అంబానీ, అదానీ ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వివరించారు. దోపిడీ, మతం, జాతీయ వాదం కలయిక దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమన్నారు. అమెరికాలో దేవుడిని నమ్మే వారి సంఖ్య వేగంగా తగ్గుతూ నెలకు నాలుగైదు చర్చీలు మూతపడుతుంటే మన దేశంలో మాత్రం నెలకు నాలుగైదు కొత్త దేవాలయాలు పుట్టుకొస్తున్నాయన్నారు. రచయితలు విస్తృతంగా అధ్యయనం చేయకపోతే శత్రువును ఎదుర్కోవడం అంత సులువు కాదన్నారు. మోడీ బ్రాండ్‌ను పెంచేందుకు కార్పొరేట్ శక్తులు పనిచేస్తున్నాయన్నారు. కార్పొరేట్ ఇమేజ్ సెంటర్ బేస్ బ్రాండేనన్నారు. మాల్‌కు పోయి షాపింగ్ చేస్తేనే గొప్ప అనే భావనను ప్రజల్లో కల్పిస్తున్నారన్నారు. బయట మార్కెట్లో 300 ఉండే షర్ట్‌ను అదే మాల్లో రూ.3000 పెట్టి అమ్ముతున్నారన్నారు. కార్పొరేట్ షాపింగ్ మాల్‌కు పోవడం మానేయాలనీ, మోడీని కూడా ఒక ప్రొడక్ట్‌గానే భావించి బయటపడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కవి, రచయిత యూటూబ్ ఛానళ్లను తెరవాలనీ, సోషల్‌మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఆయా సెషన్లకు కవులు, రచయితలు అయిన కాత్యాయని విద్మహే, స్కైబాబా, పసునూరి రవీందర్, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షత వ్యహరించ గా.. జి.నిరంజన్, జ్వలిత, యాకూబ్, నరేశ్‌కుమార్ సూఫీ సమన్వయకర్తలుగా ఉన్నారు.
సమూహ(సెక్యూలర్ రైటర్స్ ఫోరం) కమిటీ ఎన్నిక
సమూహ (సెక్యులర్ రైటర్స్ ఫోరం) కమిటీని శనివారం ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యులుగా డాక్టర్ శివారెడ్డి, ఖాదర్ మొహియుద్దీన్, నందిని సిధారెడ్డి, నారాయణ స్వామి, జూపాక సుభద్ర ఉన్నారు. కన్వీనర్లుగా యాకూబ్, పసునూరి రవీందర్, ఎ.కె.ప్రభాకర్, మెట్టు రవీందర్, భూపతి వెంకటేశ్వర్లు, కాత్యాయనీ విద్మహే, నరేశ్ సూఫీ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జిలుకర శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, దాసోజు లలిత, కటుకోజ్వల ఆనందాచారి, మెర్సీ మార్గరెట్, నాళేశ్వరం శంకరం, స్కైబాబా, మల్లారెడ్డి, రూపారుక్మిణి, జగన్‌రెడ్డి, జ్వలిత, అమృత్‌రాజు, గాజోజు నాగభూషణం, గుడిపల్లి నిరంజన్, మన్నె ఎలియా, మువ్వా శ్రీనివాసరావు, ఏ.శంకర్, రాపోలు సుదర్శన్, సిద్దంకి యాదగిరి, పాలమూరు అధ్యయన వేదిక ఒకరు ఉండనున్నారు. పరిశీలకులుగా చల్లపల్లి స్వరూపారాణి, బండి నారాయణస్వామి, వి.ప్రతిమ, కృష్ణారావు, మల్లిపురం జగదీశ్, తదితరులు ఉండనున్నారు.
భిన్న సాంస్కృతిక సమూహాలను నిత్యం కలవాలి : కె.శ్రీనివాస్
ఇతర మతాల్లోని, సొంత మతంలోని వైవిధ్యాలు తెలియకుండా పోతున్నాయనీ, వాటిని తెలుసుకునేందుకు భిన్న సాంస్కృతిక సమూహాలను నిత్యం కలవాలని రచయితలు, కవులకు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ సూచించారు.
ముస్లింల ఇండ్లకు వెళ్లాలి…వారిని మన ఇండ్లకు ఆహ్వానించాలన్నారు. తక్షణ విషయాలపై స్పందిం చడానికే పరిమితమవుతున్నారనీ, దీర్ఘకాలిక అంశాలపై అంతగా స్పందించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని ప్రశ్నించేవారిపై కమ్మీలు, చైనా ఏజెంట్లు అనే ముద్ర వేస్తున్నారన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఏం రాయాలి? ఎలా రాయాలి? ఎన్ని పుస్తకాలు తీసుకు రావాలి? అనే కార్యక్రమాన్ని కచ్చితంగా కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. ఎంచుకునే పదజాలంలో జాగ్రత్తలు తీసుకోవాలనీ, సోదరభావాన్ని ప్రమోట్ చేయాలని కోరారు. వచనంలో ఎక్కువగా రాయాలనీ, ఆలోచనను అడ్రస్ చేసే మంచి ప్రక్రియ అదేనని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామాజిక మాద్యమాల్లో జరిగే తప్పుడు ప్రచారాలను ఎత్తిచూపాలన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండాలని చూస్తు న్నా ఎలా రెచ్చగొట్టాలి? రోడ్ల మీదకు ఎలా రప్పించాలి? వారి మీద ఎలా దాడులు చేయాలి? కేసులు ఎలా పెట్టిం చాలి? వాటిని జనం నమ్మేలా ఎలా ప్రచారం చేయాలి? అనే విషయాల్లో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అవుతున్న దన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు మెలకువతో వ్యవహరించాలన్నారు.
దీవష్ట్రఱఅస ్‌ష్ట్రవ రఱశ్రీవఅషవ..