నువ్వు సిగరెట్‌ కాలిస్తే అది నిన్ను కాల్చేస్తుంది

ధూమపానం నేడు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఆరోగ్యానికి మరణ శాసనం రాస్తుంది. పొగాకును సిగరెట్‌, బీడి, చుట్ట, హుక్కాలను పొగరూపంలోనూ, తంబాకు, జర్ద… వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు, చిన్న వత్తి పనులు చేసేవారు, నిరక్షరాస్యులు అవగాహన లేక వాడుతుంటారు. కానీ నేడు ఆ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు విపరీతంగా వీటికి బానిసలుగా మారుతున్నారు. ఆ వివరాలేంటో మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈవారం సోపతిలో చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 60 లక్షల మందికి పైగా పొగ తాగడంవలన కనీసం 10 ఏండ్లు ముందుగానే మరణిస్తున్నారు. అమెరికాలో పొగతాగే వారి పక్కన ఉన్నవారు (Second Hand Smoking) కూడా లక్షల్లో మరణిస్తున్నారు. కోటి యాభై లక్షల మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. 20 వ శతాబ్దంలో 100 కోట్ల మంది దీని వలన మరణించారని అంచనా. అమెరికా, బ్రిటన్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు పొగ తాగడం వలన మరణిస్తున్నారు. ఇంతకు ముందు ధనిక దేశాల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉండేవి కానీ గత దశాబ్దంలో మరణాల శాతం కొంత తగ్గుతూ వస్తుంది. ఆశ్చర్యంగా పేద దేశాలైన సూడాన్‌, నైజీరియాలలో పొగతాగడం, మరణాలు తక్కువగా ఉన్నాయి. ధూమపానంలో చైనా, భారత్‌లు మొదటి, రెండో స్థానాల్లో ఉండగా స్వీడన్‌ చివరలో ఉంది. మన దేశంలో ఛత్తీస్‌ ఘడ్‌ మొదటి, హిమాచల్‌ ప్రదేశ్‌ చివరి స్థానాల్లో ఉన్నాయి
మన దేశంలో ప్రతిరోజూ 18 ఏళ్ల వయసు లోపున్న పిల్లలు 2000 మంది మొదటిసారి సిగరెట్‌ తాగుతున్నారు. యువకులు, స్నేహితులతో, పార్టీలలో, ఫ్యాషన్‌ కోసం అభిమాన హీరోలను అనుకరిస్తూ, సరదాగా మొదలు పెట్టి, అప్పుడప్పుడు తాగుతూ మెల్లగా వాటికి బానిసలవుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్‌ అనే ప్రమాదకర రసాయనం పొగ ద్వారా మెదడులో డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల అయ్యేలా చేస్తుంది. అందువలన కొంతసేపు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ఇది ఒక మత్తు మందులాగా పని చేస్తుంది. కొన్ని గంటల్లో దీని ప్రభావం తగ్గేసరికి నిస్సత్తువగా అనిపించడం, మళ్ళీ మళ్ళీ సిగరెట్‌ తాగాలనిపిస్తుంది. అలా అలవాటు కాస్తా వ్యసనంగా మారుతుంది. దాని ప్రభావం తగ్గి మళ్లీ పొగ తాగక పోతే చికాకు,కోపం, ఆందోళన, తలనొప్పి, గుండె దడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సిగరెట్‌ పొగలో 7000 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. నికోటిన్‌ తో పాటు తార్‌, క్రోమియం, కాడ్మియం, లెడ్‌, సైనైడ్‌, అమ్మోనియా, బెంజీన్‌, ఆర్సెనిక్‌, ఇంకా పోలోనియం వంటి రేడియో ధార్మికత కలిగిన ప్రమాదకరమైన పదార్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా తార్‌ వలన పొగతాగే వ్యక్తి చేతి వేళ్ళు, పెదవులు, దంతాలు, నోటి లోపలి భాగాలు, శ్వాస నాళం ఊపిరి తిత్తులు కూడా నల్లగా మారిపోతాయి. నోటిలో ఉండే మ్యూకస్‌ పొర దళసరిగా మారుతుంది. ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే, నోటిని శుభ్రం చేసే లాలాజలం కూడా చిక్కబడి నోరు ఎండిపోవడం, తెల్ల మచ్చలు, పుండ్లు పడి నోరు దుర్వాసన వస్తుంది. ఇక హుక్కా అయితే సిగరెట్‌ కన్నా పదింతలు ప్రమాదకరమైనది.
తంబాకు, జర్థా వంటివి బుగ్గన పెట్టుకుని నమలడం చేస్తుంటారు. వాటి నుండి వచ్చే ద్రవంలో 28 రకాల విష పదార్థాలు ఉంటాయి. దీన్ని మింగడం వలన, నోరు, కడుపులో పుండ్లు పడి అల్సర్లుగా మారి, నోటి గొంతు, కడుపు, పేగుల్లో కేన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో నిప్పున్న వైపు చుట్టను నోటిలో పెట్టుకుని పొగ పీలుస్తూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరమైన అలవాటు. కొందరు పొగ తాగిన అందరికీ కేన్సర్‌ వస్తుందా అని వాదిస్తుంటారు. అందరికీ రాకపోవచ్చు కానీ క్యాన్సర్లు వచ్చిన వారిలో 60 నుండి 70 శాతం మందికి ఏదో ఒక రూపంలో పొగాకు వాడే అలవాటు ఉంటుంది. అది మరచిపోకూడదు. చాలా మందికి నోరు తెరవలేని స్థితి వస్తుంది.
మనం ముక్కు ద్వారా తీసుకునే గాలి శ్వాస నాళం ద్వారా రెండుగా చీలి ఊపిరితిత్తులకు చేరుతుంది. శ్వాస నాళం లోపలి భాగంలో వెంట్రుకల వంటివి(Cilia) ఉండి మనం లోపలికి పీల్చుకునే గాలిలోని దుమ్ము లేదా రోగ కారక క్రిములు లోపలికి పోకుండా ఆపుతాయి. కానీ పొగలో ఉండే హానికారక పదార్ధాలు సీలియా కదలికలను తగ్గించి ఊపిరితిత్తుల పని తీరును తగ్గిస్తాయి. నాళాల చివరలు గుండ్రటి ద్రాక్ష గుత్తులుగా ఉండే ఆల్వియోలైలను కలిగి ఉంటాయి. ఇవి శ్వాస ద్వారా పీల్చే ఆక్సిజన్‌ ను రక్త ప్రవాహంలోకి పంపుతాయి. కానీ పొగలోని రసాయనాల వలన ఇవి మరణిస్తూ ఉండడం వలన కావలసినంత రక్తం వివిధ భాగాలకు అందదు. ఊపిరతిత్తుల సామర్థ్యం తగ్గి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి లక్షణాలు ఉండే బ్రాంకైటిస్‌,  (COPD (chronic obstructive pulmonary disease) వంటి రోగాలు వస్తాయి. ఇవి 40 సంవత్సారాలు దాటిన వారికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, టిబి వస్తే త్వరగా తగ్గవు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గి కార్బన్‌ డయాక్సైడ్‌ శాతం పెరిగితే బయటనుండి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తుంది.
ఊపిరితిత్తులు సరిగా పనిచేయక రక్తం శుభ్రం కాకపోవడం, చిక్కగా అవడం వలన రక్తనాళాలు ముడుచుకు పోవడం, లోపలి భాగాలలో రక్తం గడ్డలు కట్టడం జరుగుతుంది. పొగలో ఉండే నికోటిన్‌ వలన కిడ్నీలు చెడిపోయి బిపి పెరుగుతుంది. కాళ్ళకు వెళ్ళే నాళాల్లో పూడిక ఏర్పడితే కాళ్ళ వాపులు, చచ్చు పడడం, పుండ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గక పోవడం, ఒక్కోసారి ప్రాణం కాపాడడం కోసం కాలు తీసివేసే పరిస్థితి కూడా వస్తుంది. గుండెకు వెళ్ళే నాళాల్లో రక్తం గడ్డలు కట్టడం జరిగితే గుండెపోటు, ఎంజైనా వంటి గుండె జబ్బులు కలుగుతాయి. మెదడుకు సంబంధించి అయితే పక్షవాతం, మెదడులో రక్త నాళాలు చిట్లిపోవడం వలన మరణం సంభవించ వచ్చు.
పొగాకు వాడే అలవాటు బాగా ఉన్న వారికి చర్మం ముడతలు పడి వృద్ధాప్యం త్వరగా వస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బ తిని, పనితీరు తగ్గి జీవితంలో నాణ్యత కోల్పోతారు. కీళ్ల జబ్బులు, కంటిలో పొరలు (Cataract)ముందుగానే వస్తాయి, వినికిడి శక్తి తగ్గుతుంది. వీటికి తోడు బిపి షుగర్‌ ఉంటే మరింత అధ్వాన్నం అవుతుంది. అనేక రోగాలు, హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వలన ఎముక బోలుగా అయి తేలికగా విరిగే ప్రమాదం ఉంది.
పొగ తాగేవారి పక్కన లేదా ఒకే గదిలో ఉన్నవారి మీద కూడా పొగ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, పసి పిల్లలు, గర్భిణులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పొగ తాగే వారికి వచ్చే అన్ని వ్యాధులతో పాటు, పిల్లలలో ఎత్తుకు తగినంత ఎదుగుదల ఉండదు. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సరిగా పనిచేయకపోవడం వలన నెలసరి సరిగా రాకపోవడం, పెళ్ళి అయిన మహిళలకు అండం సరిగా విడుదల కాకపోవడం, మగ వారికి కూడా వీర్యకణాలు తక్కువ కావడం వలన పిల్లలు పుట్టక పోవడం జరుగుతుంది. గర్భిణి స్త్రీలు పొగతాగడం వలన అబార్షన్‌ అవడం, కావలసిన సమయానికి ముందే ప్రసవం కావడం, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం, కడుపులో కాని, పుట్టిన వెంటనే మరణించడం కానీ జరుగుతుంది. పొగ తాగే అలవాటు ఉన్న తల్లి పాలు బిడ్డ తాగడం వలన తల్లి రక్తంలో ఉండే నికోటిన్‌ శిశువుకు చేరి ప్రమాదం జరుగుతుంది. తల్లి కడుపులో పెరుగుతున్న సమయంలో కణాల్లోని క్రోమోజోమ్‌లలో ఉండే DNA లో అసహజమైన మార్పులు రావడం వలన పుట్టబోయే బిడ్డకు అనేక జబ్బులతో పాటు క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
చికిత్సలో భాగంగా ముందు పొగ తాగడం అపించి, నికోటిన్‌ ను కొద్ది మోతాదులో శరీరానికి అంటించే స్టికర్ల వంటివి, చప్పరించే మందుల రూపంలో ఇస్తారు. చికిత్స కూడా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. డాక్టర్ల భరోసా, కౌన్సెలింగ్‌ కూడా సహాయ పడతాయి. నోటి కండరాలు గట్టిపడి నోరు తెరవలేని స్థితి వస్తే మందులతో తగ్గకపోతే లేజర్‌ చికిత్స చేయవలసి ఉంటుంది. శ్వాసకోశ వ్యాధుల్లో సమస్య తెలుసుకోవడానికి మత్తు ఇచ్చి బ్రాంఖోస్కోపీ ద్వారా, అదే ఆహార నాళానికి సంబంధించి అయితే ఎండోస్కోపీ, కొలోనో స్కోపీల ద్వారా పరిశీలించి అవసరం అయితే ముక్క పరీక్షలు చేస్తారు. ఏ అవయవంలో అయినా కేన్సర్‌ ఉందని వస్తే ఆ భాగం తీసేయడంతో పాటు రేడియేషన్‌, ఖీమో థెరపీ ద్వారా కేన్సర్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కుటుంబానికి ఆర్థికంగా మరింత భారం అవుతుంది. ముఖ్యంగా పేదలలో ఒక వ్యక్తి బలహీనత, దురలవాటు వలన కుటుంబం రోడ్డున పడుతుంది. ఇటువంటి కుటుంబాలు ఉన్న సమాజం అభివృద్ధిని ఎలా సాధిస్తుంది?
ఇంతగా జీవితాలను నాశనం చేసే పొగాకు వాడకానికి అందరూ ముఖ్యంగా యువత దూరంగా ఉండాలి. వ్యసనంలా మారకుండా జాగ్రత్త పడాలి. ఎంత ఎక్కువ కాలం వాడితే చెడిపోయిన అవయవాలు, ఆరోగ్యం మామూలు స్థితికి రావడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. దీర్ఘకాలిక అలవాటు ఉన్నవారు మానేసిన 10 ఏండ్ల తర్వాత అవయవాలు అన్నీ మామూలు స్థితికి వస్తాయి. పొగతాగడం మానేయాలని దృఢమైన సంకల్పం ఉండాలి. అలవాటు మానేయాలని నిర్ణయించు కున్నప్పుడు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పి వారి సహకారం తీసుకోవాలి. పొగతాగే ప్రదేశాలకు వ్యక్తులకు దూరంగా ఉండాలి ఒకసారి మానేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మొదలు పెట్టకూడదు. చాలామంది కొన్నాళ్ళు మాని మళ్ళీ మొదలు పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే ఎప్పటికీ మానలేరు.
పొగ తాగడం ఒక్కటే కాదు. మన చుట్టూ ఉన్న అనేక రకాల పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, చెట్లు కొట్టేయడం వలన వాతావరణ కాలుష్యం పెరగడం కూడా ఆరోగ్యానికి నష్టం కలుగ చేస్తాయి. ప్రతి ఒక్కరూ కాలుష్యం తగ్గించడంలో తమ పాత్ర నిబద్దతతో పాటించాలి. ప్రభుత్వాలు కూడా చిత్త శుద్ధితో కాలుష్య కారకాలను, పొగాకు వాడకాన్ని నిషేధించాలి. మొక్కుబడిగా చేయకూడదు. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రుల పరిసరాలలో పొగ తాగడం నేరంగా పరిగణించాలి. బస్‌, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌ పోర్టులు, జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలలో నిషేధాజ్ఞలు అమలు చేసి, పాటించని వారిని శిక్షించాలి. పెద్ద పెద్ద హీరోలు పొగాకు ఉత్పత్తులకు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలి. ప్రజలూ ప్రభుత్వాలూ కలసి పనిచేస్తేనే కానీ ఈ సమస్యని అధిగమించలేం.

– డా|| సిహెచ్‌.శారద, 9966430378

Spread the love