మద్యం కావాలంటే ఏజ్ చెప్పాల్సిందే…!

నవతెలంగాణ ఢిల్లీ: మద్యం విక్రయ కేంద్రాల వద్ద వయసు తనిఖీ నిమిత్తం పటిష్ఠమైన విధానం అమలుకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం నుంచి స్పందన కోరింది. ‘కమ్యూనిటీ ఎగైనెస్ట్‌ డ్రంకెన్‌ డ్రెవ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ బార్‌లు, పబ్‌లు, పలు రకాల మద్యం విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారులు లేదా కొనుగోలుదారుల వయసును తనిఖీ చేయడానికి పటిష్ఠమైన విధానం లేదని, మద్యం డోర్‌స్టెప్‌ డెలివరీని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో కేంద్రం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రతివాదులుగా చేర్చింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మద్యం డోర్‌స్టెప్‌ డెలివరీలకు సంబంధించిన అనుమతి ప్రతిపాదనలను ప్రతివాదులు పరిశీలించే పనిలో ఉన్నారని, ఈ విధానాన్ని అనుమతిస్తే మైనర్లకు మద్యం అలవాటయ్యే ప్రమాదం మరింత పెరుగుతుందని స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Spread the love