ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తే ప్రతిఘటన తప్పదు

– మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలను ఆకాంక్షలను విస్మరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని బీఆర్‌ఎస్‌ సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శానసమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామనీ, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పినా ఇతరులపై నిందలేసి వాగ్దానాల అమలు నుంచి తప్పించుకున్నా అధికార పార్టీని తప్పకుండా నిలదీస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనపై నిందలేసీ పబ్బం గడుపుకునే ప్రయత్నం గవర్నర్‌ ప్రసంగంలో ఉందన్నారు. పరనింద ఆత్మస్తుతి తప్ప పరిపక్వత లేదని చెప్పారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన ఉంటే 2018లో బీఆర్‌ఎస్‌ను ఓడిపోయేదని గుర్తు చేశారు. 2014లోనే తెలంగాణకు కేసీఆర్‌ నాయకత్వంలో స్వేచ్ఛావాయువులు వచ్చాయని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పలుమార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్కషంగా అణచివేసిందన్నారు. 2009, డిసెంబర్‌ తొమ్మిది తర్వాత ఎవరి తాత్సారం వల్ల బలిదానాలో జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన మంచి విషయాల్లో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలనీ, పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని సూచించారు.

Spread the love