– అదానీపై జేపీసీ వేయాల్సిందే
– రాజదండం వాడటం ఫాసిస్టు చర్య : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
నవతెలంగాణ-అమరావతి బ్యూరో
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం విషయంలో రాష్ట్రపతిని విస్మరించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉభయసభలకు అధిపతి రాష్ట్రపతి తప్ప ప్రధాన మంత్రి కాదన్నారు. రాష్ట్రపతిని విస్మరించి నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా దేశంలోని 19 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాయని తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఎంబివికెలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79లో పార్లమెంటు, రాజ్యసభలను నడిపించేది రాష్ట్రపతే అని స్పష్టంగా రాసుకున్నామని తెలిపారు. రాజ్యాంగ అధిపతి, పార్లమెంటు సమావేశాల ప్రొసీడింగ్స్‌ను, ఉభయసభలను నడిపించేది రాష్ట్రపతే అని అన్నారు. ప్రధాన మంత్రి పార్లమెంటుకు కూడా నాయకుడు కాదు అనేది తెలుసుకోవాలన్నారు. కేవలం అధికార పార్టీకి నాయకుడు మాత్రమేనని అన్నారు. ప్రతిపక్షానికి కూడా క్యాబినెట్ మంత్రి హోదాతో ఒక నాయకుడు వుంటారన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం వుండాల్సిందేనన్నారు. అన్ని అధికారాలూ రాష్ట్రపతి చేతిలోనే వున్నాయన్నారు. ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారి అయితే ఎంపీలు ప్రజలకు జవాబుదారిగా వుంటారని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రారంభోత్సవాలు చేశారని చెప్పే బీజేపీ నాయకులు కూడా ఇపుడు పార్లమెంట్‌లో క్యాంటిన్‌లాంటివి ప్రారంభోత్సవం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ అధిపతిని అగౌరపరిచే చర్యలను అంతా వ్యతిరేకించాలని ఖండించాలని కోరారు.
రాజదండం చేతబట్టడం ఫాసిస్ట్ చర్య
ప్రధాని నరేంద్రమోడీ రాజదండంను చేత బట్టడం పూర్తి ఫాసిస్ట్ చర్య అని అన్నారు. రాజరిక వ్యవస్థలో అధికారం దేవుడు ఇచ్చాడనేందుకు గుర్తుగా పండితులు రాజదండంను రాజుకు ఇచ్చే వారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజదండం ఎలా వాడుతారని అన్నారు. నాడు స్వాతంత్య్ర వచ్చిన కొత్తలో చాలామంది రాజులు ప్రధాని నెహ్రూకు బహుమతులు ఇచ్చారని అందులో బాగంగానే చోళ రాజవంశీయులు రాజదండాన్ని నెహ్రూకు ఇచ్చారని తెలిపారు. తనకు ప్రజలు అధికారం ఇచ్చారు తప్ప దేవుడుకాదని వారు ఇచ్చిన రాజదండాన్ని అలహా బాద్‌లోని మ్యూజియంలో పెట్టించారని అన్నారు. ఇపుడు మోడీ అధికారం దేవుడు ఇచ్చాడని చాటు కునేందుకు మళ్లీ రాజదండం చేతబట్టడం సరైంది కాదన్నారు. హిందూరాజ్యంను పునర్మించాలనే కుట్రలో బాగంగానే రాజదండంను తెరపైకి తెచ్చారని అన్నారు.
అదానీ వ్యవహారంపై జేపీసీ తప్ప మరో మార్గం లేదు
అదానీ కుంభకోణాల విషయంలో ప్రధాని సమాధానం చెప్పకపోవడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ ద్వారా అదానీకి కట్టబెట్టారని అన్నారు. సుప్రీంకోర్టు వేసిన కమిటికి సెబి ఆధారాలు ఇవ్వాల్సి వుండగా, సెబి అధికారాలపై మోడి కోత పెట్టారని అలాంట ప్పుడు ఎలా ఆధారాలు వస్తాయని ప్రశ్నించారు. అధికారాలులేని సెబీని అడ్డంపెట్టుకొని క్లీన్‌చిట్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అదానీ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తప్ప మరో మార్గంలేదని తెలిపారు. సెబీకి లేని అధికారాలు కూడా జేపీసీకి వుంటాయని అన్నారు. క్రోనిక్యాపిటల్‌తో దేశంలో పెద్ద దోపిడీ జరుగుతోందని అన్నారు.
నిరంకుశవాదం పెరుగుతోంది
దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిరంకుశవాదం ప్రమాదకరంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల స్థానంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ల ద్వారా పాలించుకోవాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వ్యతిరేకిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిందన్నారు. ఇపుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్‌ల చేతికే ఇచ్చింది. ఇది ప్రమాదకర చర్య అని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని నిరూపణ అయ్యింది
దేశంలో అవినీతిని అరికడతామని, నల్లడబ్బును వెలికి తీస్తామని నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ తుగ్లక్ చర్య అని నిరూపణ అయ్యిందని తెలిపారు. ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దుచేసి రెండువేల రూపాయల నోటును తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చామని అన్నారు.
నోట్లరద్దు ప్రక్రియతో అవినీతి తగ్గకపోగా అవినీతి విలువ పెరిగిపోయిందని అన్నారు. గతంలో వెయ్యి రూపాయలుండేది ఇపుడు రెండువేలు అయ్యిందన్నారు.