ఆరోసారి అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌

IIT Madras is the best institute for the sixth time– వర్సిటీల ర్యాంకులను ప్రకటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
న్యూఢిల్లీ: దేశవ్యాపతంగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తాయి. మొత్తం 13 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
మొత్తంగా ఉన్నత విద్యాసంస్థలలో.. ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. టాప్‌ 10లో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్‌ ఢిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చోటు దక్కింది. విశ్వవిద్యాలయాల పరంగా.. ఐఐఎస్‌సీ బెంగళూరు, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
కళాశాలల విభాగంలో.. హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయిట్‌ స్టీఫెన్‌ కాలేజీ టాప్‌ 3లో ఉన్నాయి. ఇవన్నీ దిల్లీలోనే ఉన్నాయి.ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఐఐటీ మద్రాస్‌ వరుసగా 9వ సారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.
మేనేజ్‌మెంట్‌ విభాగంలో : ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోళికోడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఫార్మసీ విభాగంలో : జామియా హమ్‌దర్ద్‌ (ఢిల్లీ) మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ రెండో స్థానం దక్కించుకుంది. బిట్స్‌ పిలానీ మూడో స్థానంలో నిలిచింది.
వైద్య విద్యలో: దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
డెంటల్‌లో: మొదటి స్థానంలో చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్‌, రెండో స్థానంలో మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, మూడో స్థానంలో ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెన్స్‌ నిలిచాయి.
పరిశోధ విద్యాసంస్థల్లో: ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ దిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో : ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఢిల్లీ) తొలి స్థానంలో ఉండగా.. కర్నాల్‌లోని ఐసీఏఆర్‌, లూధియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
ఆవిష్కరణల విభాగంలో: ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ హైరాబాద్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీల్లో: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్‌ సాధించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి.
న్యాయవిద్యలో: బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీ, దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆర్టిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో: ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ టాప్‌ 3 ర్యాంకులు సాధించాయి.

Spread the love