ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులు

 – బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీమంత్రి సంభాని తీవ్ర ఆగ్రహం
నవతెలంగాణ-కల్లూరు
: ఖమ్మం జిల్లాలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  పర్యటన ఉన్న నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషనుకి తరలించడాన్ని ఖండిస్తూ  మాజీమంత్రి, టీపీసీసీ  సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్  ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం  మాట్లాడుతూ అధికార పార్టీ పదేళ్ల పాలనాకాలంలో గత రెండు పర్యాయాలు ప్రజలకి ఇచ్చిన హామీలను అమలుపర్చలేదన ఆరోపించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, దళితులు, ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబం వల్ల అప్పులకుప్పగా మారిందన్నారు. ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో, అధికారబలంతో పోలీస్ వ్యవస్థని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంగు ఆర్భాటాలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధమయ్యా  తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ముందు వాటిని అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో శంకుస్థాపన చేసిన వాటికి ఇప్పుడు మళ్లీ కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారని ఇంకెన్నాళ్ళు ప్రజలని మోసం చేస్తారన్నారు. అధికార అహంతో అణచివేస్తే ప్రజలు మిమ్మల్ని అణచి వేస్తారని హెచ్చరించారు. నిజంగా అభివృద్ధి జరిగిఉంటే  అక్రమ హౌస్అరెస్ట్ లు ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love