అర్ధరాత్రి అక్రమ అరెస్టులు సిగ్గుచేటు

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు సిగ్గుచేటు– మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌
నవతెలంగాణ-కోడంగల్‌
నిరుద్యోగులకు గ్రూప్‌-2 గ్రూప్‌-3 పోస్టులను అదనంగా పెంచి, డీఎస్సీ, గ్రూప్‌-2 సమయం పొడిగించాలని ఆందోళన కొనసాగిస్తుంటే అర్ధరాత్రి అరెస్టు చేయడం సిగ్గుచేటని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ అన్నారు. దౌల్తాబాద్‌ మండలం సుల్తాన్‌ పూర్‌ గ్రామంలో మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పోలీసులు చేరుకొని అరెస్టు చేసి దౌల్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేరికల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగుల పోరాట ఫలితంగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఇప్పుడు నిరుద్యోగులను తడిగుడ్డతో గొంతు కోస్తుందన్నారు. తొలి క్యాబినెట్‌ లోనే మెగా డీఎస్సీతో పాటు రెండు లక్షల ఉద్యోగుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపు లాంటి కనీస నిర్ణయాలు తీసుకోవడంలోనూ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. నిరుద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తుంటే ఫెయిడ్‌ ఆర్టిస్టులంటూ ట్రోల్‌ చేస్తూ అవమానించడం బాధాకరమన్నారు. నిరుద్యోగులు పరీక్ష తేదీలను పొడిగించాలని డిమాండ్‌ చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఏకపక్షంగా పరీక్షల తేదీలను ప్రకటిస్తూ పుండు మీద కారం చల్లుతున్నట్టు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులతో అయితే గద్దెనెక్కారో అదే నిరుద్యోగులు గద్దె దింపడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుందని నిర్బంధ పాలన కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ కొట్టుకపోవడం ఖాయం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల డిమాండ్‌ నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love