సీపీఎం నాయకులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

నవతెలంగాణ -కంటేశ్వర్

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల దుబ్బ ప్రాంతంలోని సర్వే నెంబర్ 171 లోని ప్రభుత్వ స్థలంలో నాలుగు నెలలుగా ఉండడానికి ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గుడిసెలు వేసి పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో సిపిఎం నాయకులపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయగా పోలీసులు అతి ఉత్సాహంతో కేసులు పెట్టడాన్ని, ఖండిస్తూ ఆర్డీవో కార్యాలయం నుండి ఏసీపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి9 సంవత్సరాలు గడుస్తున్న ఏ పేదవాడికి కూడా ఇప్పటివరకు ఇల్లు ఇచ్చినట్టు పరిస్థితులు లేదు అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో వేల మంది కుటుంబాలు బయట అద్దె ఇంట్లో కిరాయి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ నానా నరకయాతన అనుభవిస్తున్నా.‌ ప్రజా ప్రతినిధులు గాని ప్రభుత్వం గాని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు అలాగే సిపిఎం పార్టీగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలను గుర్తించి వారితో నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూమిలో గత నాలుగు నెలలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అక్కడే గుడిసెలు వేసుకొని ఎండకు ఎండి వానకు తడిసి రాత్రింబవళ్లు కష్టాలు పడుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని ఇది నచ్చక కొంతమంది భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని వెంచర్లుగా చేసినటువంటి వారు సిపిఎం నాయకుల పైన అలాగే ఈ గుడిసె వాసుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ రూరల్ పోలీస్ స్టేషన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ లపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం నిజ నిజాలు తెలుసుకోకుండా ఏ రకంగా కేసు పెడతారని చెప్పి ఏసీపి ని ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపి కిరణ్ కుమార్  ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ భూమిని సర్వే చేయించి ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని కోరారు. అదేవిధంగా ఉండడానికి జాగలేనటువంటి పేద ప్రజలకు అట్టి భూమిని పంచి ఇచ్చే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూ పోరాటం కొనసాగుతుందని ఎవరొచ్చినా భయపడేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి పెద్ది సూరి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి సుజాత, పి మహేష్, కే రాములు, నగర కమిటీ సభ్యులు డి కృష్ణ ,అబ్దుల్, మునీర్ హైమద్, నరసయ్య, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love