అక్రమంగా నగదు తరలింపు

అక్రమంగా నగదు తరలింపు– మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్‌
– రూ.75లక్షలకుపైగా స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో అక్రమంగా నగదు తరలిస్తున్న నిందితులపై టాస్క్‌ఫోర్సు పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.40లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పాతబస్తీలో మరో వ్యక్తి నుంచి రూ.14.97లక్షలు, ఎంజేఎం మార్కెట్‌ సమీపంలో ఇద్దరి నుంచి రూ.21లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం టాస్క్‌ఫోర్సు డీసీపీ రష్మి పెరుమాళ్‌ తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డికి చెందిన కె.రాజేష్‌, నిజాంపేట్‌కు చెందిన డి.ముత్యాలు హాఫీజ్‌పేట్‌లోని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వద్ద పని చేస్తున్నారు. కారులో డబ్బులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు అబిడ్స్‌లోని రామకృష్ణా సినిమా థియేటర్‌ వద్ద వారిని అడ్డుకుని తనిఖీ చేశారు. రూ.40లక్షలను గుర్తించిన పోలీసులు వాటిని, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆసీఫ్‌నగర్‌లో గోబల నాగరాజుని అరెస్టు.. రూ.14.97లక్షలు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుండగా, మల్లేపల్లికి చెందిన నూర్‌మహ్మద్‌, ఫైజల్‌ మాలిక్‌ అక్రమంగా నగదును తరలిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆబిడ్స్‌లోని ఎంజేఎం మార్కెట్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసి రూ.21లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Spread the love