అక్రమ వసూళ్ల పర్వం.. మీ సేవ ధరణిలో నిలువు దోపిడి

– ప్రజల జేబులకు చిల్లు
– అధిక వసూళ్లను అరికట్టాలని ప్రజలు వేడుకోలు
నవతెలంగాణ – ఉప్పునుంతల 
ప్రజలకు ప్రభుత్వ సర్వీసులను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవ, ధరణి కేంద్రాలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా మీసేవ కేంద్రాలుకు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకునేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండవలసిన మీసేవ, ధరణి  కేంద్రాలు అక్రమ వసూళ్లకు వేదికగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలు మరింత అవినీతిగా మారాయి అని ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే మీసేవ కేంద్రా నిర్వాహకులు వసూలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్నారు. ఇది చాలాదాన్నట్లు, జిరాక్సులు, స్కానింగ్, అబ్డావిటి, బాండు, రెవెన్యూ స్టిక్కర్ల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. మరోవైపు పనిపై వచ్చిన ప్రజలను గంటల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఉప్పునుంతల మీసేవ, ధరణి కేంద్రాలా అక్రమ వసూళ్ల బాగోతం ఉప్పునుంతల మండల కేంద్రంలోని రెండు మీసేవ కేంద్రాలు, రెండు ధరణి కేంద్రాలు, వెల్టూరు గ్రామంలో ఒక మీ సేవ కేంద్రం నిర్వహణ కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాలు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే  ప్రజలనుండి అధిక ధరలు ఎక్కువ నగదు ప్రజల నుండి వసూలు చేస్తున్నారు.
అసలు ధర కంటే రెట్టింపు వసూళ్లు…
మీ సేవ కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు నగదును బహిరంగగానే ఎలాంటి వెనకడుగు లేకుండా వసూలు చేస్తున్నారు. ఈ ధ్రువీకరణ పత్రాలు అనగా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, ఈ డబ్ల్యూ ఎస్, ఓ బి సి, తదితర ధ్రువీకరణ పత్రాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.45 రూపాయలు మాత్రమే వసూలు చేయవలసి ఉంది. అయితే మండలంలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో ఒక్క దృవీకరణ పత్రానికి రూ.80 నుండి రూ.100 రూపాయలు బహిరంగగానే వసూళ్లు చేస్తున్నారు. అంతేకాకుండా మీ సేవ కేంద్రాల్లో ఆధార్ సేవా కేంద్రం ఉంది ఆధార్ అప్డేషన్, నూతన ఆధార్ కార్డు కోసం ఆధార్ ల పేర్లు కరప్షన్ కోసం రూ.200 నుండి రూ.300 రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఇలా అన్ని సర్వీసుల మీద అదనపు రెట్టింపు వసూళ్లు చేస్తున్నారు. జిరాక్స్ ల పేరిట మరికొంత నగదు తీసుకుంటున్నారు. ఈసీ, లేట్ రిజిస్ట్రేషన్, బర్త్, డెత్ సర్టిఫికేట్, మ్యుటేషన్, రైతుల పొలాలకు సంబంధించిన పలు రకాల సర్విస్ లు రెట్టింపు ధరల కంటే అధిక ధరలను వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లు అన్ని బహిరంగంగానే జరుగుతున్న అధికారులకు మాత్రం కనిపించడం లేదు. సంబంధిత శాఖ అధికారులు మీ సేవ, ధరణి కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రజలకు సులువుగా అందుబాటులోకి తెచ్చిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం నగదు చార్జీలు వసూళ్లు చేయాలి ప్రజల నుండి అధిక చార్జీలు తీసుకోవడం వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు మీసేవ, ధరణి కేంద్రాలలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించి అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్న మీ సేవలపై చర్యలు తీసుకొని మీ సేవ సేవలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి  – చింతల నాగరాజు, మండల కార్యదర్శి సీపీఐ(ఎం), ఉప్పునుంతల మండలం
ఉప్పునుంతలలోని మీ సేవ కేంద్రాల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు నేను పది రోజుల క్రితం ఒక మీసేవ లో మిస్సింగ్ లాస్ట్ డాక్యుమెంట్ కొరకు మీసేవ సెంటర్ వెళ్తే రిసిప్ట్ పై 1045 ఉండగా 1445 నగదు రూపాయలు వసూలు చేశారు. నా ఒక్కరి సమస్యనే కాదు ప్రజల అందరి పరిస్థితి ఇలానే ఉంది పేద ప్రజల రక్తం తాగుతున్న మీ సేవ సెంటర్లపై  అధికారులు స్పందించి అధిక చార్జీలపై ఆకస్మిక దాడులు నిర్వహించి అరికట్టాలి. ప్రభుత్వం ఊరూరా మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయాణం, పని భారం, గంటల తరబడి వేచి చూసే దుస్థితి ఉండదు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సౌకర్యంగా ఉంటుందని ఆశభావం వ్యక్తం చేస్తున్నాం.
– యం. ప్రశాంత్, కంసానిపల్లి
అధిక వసూళ్లు తీసుకుంటున్నట్లు మా దృష్టికి రాలేదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం చార్జీలు తీసుకోవాలి. అప్లికేషన్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడే పూర్తి చేస్తున్నాం ప్రజలే స్వయంగా కార్యాలయానికి వచ్చి వారి పనులు పూర్తి చేసుకొని వెళ్తున్నారు.  మీ సేవ, ధరణి లో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు చెల్లింపులు కొనసాగించాలి. మీ సేవ, ధరణి నిర్వాహకులు అధిక చార్జీలు వసూళ్లు చేసినట్లయితే ఆధారాలతో మా దృష్టికి తీసుకురావాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో విచారణ చేసి అధిక వసూలు చేసినట్లు నిర్ధారణ రుజువైతే చర్యలు తీసుకుంటాం. అధిక చార్జీల పట్ల ప్రజలు తాహసిల్దార్ కార్యాలయని సంప్రదించవచ్చు.
– ఎమ్మార్వో శ్రీకాంత్, ఉప్పునుంతల మండలం
Spread the love