మొండిగౌరెల్లిలో అక్రమ మైనింగ్‌ను రద్దు చేయాలి

– గుట్టుచప్పుడు కాకుండా కంకర మిషన్‌ నిర్మాణ పనులు
– వద్దన్నా వినని నిర్వాహకులు
– గ్రామస్తులను భయాందోళనలకు
– గురిచేస్తున్న క్రషర్‌ నిర్వాహకులు
– బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్‌
నవతెలంగాణ-యాచారం
మొండిగౌరెల్లిలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న మైనింగ్‌ పనులను రద్దు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి సర్వేనెంబర్‌ 19లో అక్రమ నిర్మాణం చేస్తున్న క్రషర్‌ నిర్మాణ పనులను ఆయన గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మైనింగ్‌ పనులు వద్దని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. దొంగతనంగా క్రషర్‌ నిర్వాహకులు హిటాచీలు, జేసీపీలు తెచ్చి పనులు చేస్తున్నారని చెప్పారు. నాలుగేండ్లుగా గ్రామస్తులు క్రషర్‌ మిషన్‌ వద్దని పోరాడుతున్నా పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. అసైన్డ్‌ ల్యాండ్‌లో అక్రమంగా నిర్వాహకులు పర్మిషన్లు తెచ్చుకుని గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పందించి పూర్తిస్థాయిలో అనుమతిని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మైనింగ్‌ తీయడానికి అక్కడ వ్యాపారులు ఉండటానికి నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. నిర్వాహకులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మొండిగౌరెల్లిలో మైనింగ్‌ అనుమతిని రద్దు చేయాలని కోరారు.

Spread the love