అన్ని శాఖల సమన్వయంతోనే మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట

పోలీసు, రైల్వే, ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షా సమావేశంలో డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాల్సిన అవసరమున్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, రైల్వే పోలీసు విభాగాల అధికారులతో డీజీపీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అంజనీ కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలే గాక హర్యానా, ఢిల్లీల నుంచి కూడా రాష్ట్రంలోకి మద్యం అక్రమంగా రవాణా అవుతున్నదనీ, దీని వలన రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నదని డీజీపీ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, మద్యం స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీసు, రైల్వే పోలీసు, ఎక్సైజ్‌ అధికారులతో పాటు నిఘా అధికారులు సమిష్టి కార్యచరణతో పని చేయాలని ఆయన సూచించారు. ఇందుకు తగిన వ్యూహాలను, ఎత్తుగడలను రచించి అమలు చేయాలని కోరారు. సీఐడీ డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తున్న 29 వేల మందిపై కేసులను నమోదు చేశామని ఆయన అన్నారు. అంతేగాక, 15 మందిపై పీడీ చట్టం కింద కేసులను కూడా నమోదు చేశామని తెలిపారు. ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రయివేటు ట్రావెల్‌ బస్సుతో పాటు రైళ్ల ద్వారా అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాష్ట్రంలోకి దిగుమతి అవుతున్నదని అన్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్‌, గోవాల నుంచి ఎక్కువగా మద్యం అక్రమంగా రవాణా అవుతున్నదని అన్నారు. ప్రధానంగా కర్నాటక, గోవాల నుంచి రాష్ట్రంలోకి టూరిస్టులగా వచ్చే వారు ఎక్కువగా ఈ అక్రమ మద్యాన్ని తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌, బలార్షా, నిజామాబాద్‌ల మీదుగా వస్తున్న రైళ్ల ద్వారా ఎక్కువగా మద్యం రవాణా అవుతున్నదనీ, దీనిపై నిఘాను పెంచి స్మగ్లర్ల ఆట కట్టించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇందుకోసం రైల్వే పోలీసు విభాగం నుంచి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయటంతో పాటు ఇతర విభాగాలతో సమన్వయమై పని చేస్తామని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కార్తికేయ మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి తరచుగా మద్యాన్ని అక్రమ రవాణా చేసేవారి జాబితాను రూపొందిస్తున్నామనీ, వాటి వివరాలను త్వరలోనే సంబంధిత శాఖలకు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు షానావాజ్‌ ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ సంజరు జైన్‌, సికిందరాబాద్‌ రైల్వే ఎస్పీ షేక్‌ సలీమాతో పాటు పలువురు ఆర్పీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love