ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరగాలి

 Immersion ceremonies should be held in a peaceful environment– అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి
– కలెక్టర్‌ రాజర్షిషా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గణేష్‌ కమిటీ సభ్యులు, గణేష్‌ మండపాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి, కమిటీ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు పలు సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసువచ్చారు. జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌, క్రాంతినగర్‌, మహాలక్ష్మివాడ, తదితర చోట్ల రోడ్లు సరిగా లేవని, తాత్కాలిక మరమ్మత్తులు చేయించాలని అన్నారు. పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
బందోబస్తు నడుమ శోభాయాత్ర సాగాలి..
గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, శోభాయాత్ర కొనసాగే మార్గాలలో సీసీ కెమెరా నిఘా ఉండేలా చూడాలని, గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా వినాయక ప్రతిమలు ప్రతిష్టించడం జరిగిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు.
సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు..
ఈ సందర్భంగా వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని, అందుకు సంబంధించి అధికారులను నియమించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రధానంగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్‌, ఫైర్‌, ఆర్‌ అండ్‌ బీ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌, ఫిషరీస్‌ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మున్సిపల్‌ శాఖకు సంబంధించిన ఫోన్‌ నెంబర్‌ 9492164153కి కాల్‌ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యామలదేవి, ట్రైనీ కలెక్టర్‌ అభిగ్యాన్‌, ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, తహసీల్దార్‌, విద్యుత్‌, మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బీ, అగ్నిమాపక, ఫిషరీస్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులు, గణేశ్‌ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love