పొంచివున్న ప్రమాదం !

– ‘పునర్విభజన’తో మైనారిటీల ప్రయోజనాలకు విఘాతం
– ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలుగా ముస్లిం ప్రాంతాలు
– అసోం వేదికగా తొలి అడుగు
అసోంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన తుది ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మార్పులపై అధికార బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుంటే అనేక సంఘాలు, పార్టీలు మాత్రం నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. పునర్విభజన ప్రక్రియ ముస్లింల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పాత్రికేయులు, విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ముస్లింలు ఓటు అనే ఆయుధం ద్వారా తమ ప్రతినిధిని ఎన్నుకోకుండా నిలువరించడమే పునర్విభజన కసరత్తు ప్రధాన ఉద్దేశమని సచార్‌ కమిటీ నివేదిక 2006లోనే వేలెత్తి చూపింది. ఇప్పుడు అసోంకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టి, వారి ఓటుకు విలువ లేకుండా చేయడానికి కుట్ర జరిగినట్లు అర్థమవుతోంది. మరికొన్ని ముస్లిం ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలుగా ప్రకటించారు.
న్యూఢిల్లీ : నియోజకవర్గాల పునర్విభజనచర్యతో మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. తన ‘దూరాలోచన’లో భాగంగా ముందుగా అసోంను ప్రయోగ వేదికగా మలచుకుంటున్న మోడీ ప్రభుత్వం, రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా జరగబోయే పునర్విభజన కసరత్తులో ఇదే సూత్రాన్ని అమలు చేస్తే అప్పుడు మైనారిటీల పరిస్థితి ఏమవుతుంది?
సచార్‌ కమిటీ ఏం తేల్చింది?
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో షెడ్యూల్డ్‌ కులాలకు రిజర్వ్‌ చేసిన స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని సచార్‌ కమిటీ కూలంకషంగా విశ్లేషించింది. ఈ రాష్ట్రాలలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఆయా రాష్ట్రాలలో పునర్విభజన కమిషన్‌ ఎస్సీలకు రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నారని సచార్‌ కమిటీ తేల్చింది. కొన్ని నియోజకవర్గాలలో అయితే వీరి జనాభా 50% దాటింది కూడా. మరికొన్ని చోట్ల షెడ్యూల్డ్‌ కులాల జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమే మంటే ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న స్థానాలను రిజర్వ్‌డ్‌ కేటగిరీ నుండి తొలగించారు. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే పునర్విభజన కమిషన్‌ ఉద్దేశపూర్వకంగానే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను రిజర్వ్‌డ్‌ స్థానాల జాబితాలో చేర్చింది. తద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని, ప్రాభవాన్ని తగ్గించింది. ప్రజాస్వామిక సంస్థలలో ముస్లిం ప్రాతినిధ్యాన్ని నీరుకార్చింది.
కమిటీ సూచనలివే…
భవిష్యత్తులో జరిపే పునర్విభజన ప్రక్రియలలో ఇటువంటి లోపాలు జరగకుండా నివారించాలని సచార్‌ కమిటీ సూచించింది. వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజనను, ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే దాని ఉద్దేశాన్ని జస్టిస్‌ సచార్‌ స్వయంగా నివేదికలో ముందుమాటలోనే ప్రస్తావించారు. మైనారిటీ జనాభా అధికంగా నివసిస్తున్న ప్రాంతాలను ఎస్సీలకు రిజర్వ్‌ చేయవద్దని, పునర్విభజన ప్రక్రియను చట్టబద్ధంగా, న్యాయ సమ్మతంగా చేపట్టాలని కమిటీ కోరింది. ఈ సూచనను అమలు చేసి ఉంటే దేశంలో మైనారిటీల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి సముచితంగా ఉండేది. అయితే దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. ప్రస్తుతం పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభలలోనూ ముస్లిం ప్రతినిధులు కేవలం 4% మంది మాత్రమే. మైనారిటీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు మరిన్ని వ్యూహాలు రూపొందించాలని సచార్‌ కమిటీ అభిప్రాయపడింది.
ఏం చేశారు?
దేశంలోని పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల సరిహద్దులు నిర్ణయించడం పునర్విభజన కమిషన్‌ విధి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన తర్వాత చేపట్టే పునర్విభజన ప్రక్రియ అన్ని నియోజకవర్గాలలో జనసంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చూస్తుంది. నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించడానికి 1952, 1963, 1972 సంవత్సరాలలో కమిషన్లను ఏర్పాటు చేశారు. అయితే 1970వ దశకం నుండి 2001 వరకూ సరిహద్దుల నిర్ణయాన్ని నిలిపేశారు. దీంతో 1974 నుండి 2007 వరకూ ఎస్సీ స్థానాలు సహా అనేక నియోజకవర్గాలలో ఎటువంటి మార్పులు జరగలేదు. అసోంలో పునర్విభజనకు సంబంధించి జూన్‌లో ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేశారు. ఆ తర్వాత ఇటీవలే దీనిపై తుది ఆదేశాలు జారీ అయ్యాయి. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండానే తాజాగా సరిహద్దులను నిర్ణయించాలని సిఫారసు చేశారు. ముసాయిదా ప్రకారం 30 నియోజకవర్గాల రూపురేఖలు మారుస్తారు. కొత్తగా 26 నియోజకవర్గాలు ఏర్పడతాయి. అయితే రాష్ట్రంలో ముస్లింలు అధికంగా నివసిస్తున్న నియోజకవర్గాల సంఖ్య 29 నుండి 22కు తగ్గిపోతుందని ఆల్‌ ఇండియా డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఉద్దేశపూర్వకం గానే తొలగించడంపై రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నా యి. ఈ నియోజకవర్గాలకు ప్రస్తుతం బెంగాలీ మూలాలు ఉన్న ముస్లిం సమాజానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేసే స్థానాలలో విలీనం చేయడమో లేదా వేరే స్థానాలలో కలపడమో చేస్తారు. వీటిలో హిందూ జనాభా గణనీయంగా ఉంది. 1971 ఎన్నికల సమయంలో బారక్‌ లోయలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను భౌగోళిక మార్పులను కారణంగా చూపుతూ 13కు తగ్గించారు. దీనికితోడు అనేక నియోజకవర్గాల పేర్లను మార్చారు. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న మూడు నియోజకవర్గా లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీలకు ఎస్సీ హోదా కల్పించకపోవడంతో వారు ఈ స్థానాలలో పోటీ చేసేఅవకాశం కోల్పోయారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోం జనాభాలో ముస్లింలు 34%గా ఉన్నారు. వీరిలో నాలుగింట మూడో వంతు బెంగాలీ ముస్లింలే. వీరినే బంగ్లాదేశ్‌ నుండి వలస వచ్చిన వారంటూ ముద్ర వేసి అవమానిస్తున్నారు.
మైనారిటీలకు అన్యాయం
బీజేపీ పాలనలో అసోంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముస్లింల హక్కులు, వారి రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశంలో జనగణన జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్‌ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. ఇది దేశ రాజకీయ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడే మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతోంది. దేశంలో…ముఖ్యంగా అసోంలో నివసిస్తున్న ముస్లిం సమాజం సామాజికంగా, సాంస్కృతికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. వారిలో అభద్రతాభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మతోన్మాద శక్తులు విజృంభించి మైనారిటీలపై అకృత్యాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ముస్లిం మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటోంది. ఇక విద్య, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యాలు ముస్లింలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలపై విద్వేష ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితులలో అసోంలో పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరగకపోతే ముస్లింలు రాజకీయ ముఖచిత్రం నుండి అదృశ్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Spread the love