– హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, కూనంనేని పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన సాధారణ స్థితికి చేరుకున్నారు. వెంటిలేటర్‌ను తొలగించడంతో సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారు. దినపత్రికలు చదువుతూ గడిపారు. బీపీ, పల్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయి. కిడ్నీ పనితీరు మెరుగుపడిం దనీ, గుండె కొట్టుకోవడంలో మార్పు వచ్చిందని ఏఐజీ వైద్యులు అన్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మినేనిని ఈనెల 16న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. శనివారం మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆస్పత్రికి వెళ్లి తమ్మినేనిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని వారు ఆకాక్షించారు. ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని అన్నారు.