అవినీతి అనకొండలను పెంచి పోషించడంలో అభివృద్ధి..

– ఆనాడు కేటీఆర్ విజయం వెనక టిడిపి ఉంది
– గ్యారెంటీ లేని బీ ఆర్ ఎస్ పార్టీ
– ఆరోపించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కేకే
– ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ- తంగళ్ళపల్లి: అవినీతి అనకొండలను పెంచి పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరిగిందని, రాష్ట్రంలో ఆ నలుగురు మోపయ్యారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు కేటీఆర్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పుడు, ఆ విజయం వెనుక టిడిపి పార్టీ ఉందని టిడిపి పొత్తు వల్లనే కేటీఆర్ గెలుపొందారని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడం కెసిఆర్ నైజం అన్నాడు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఇటు కాంగ్రెస్ పార్టీని, టిడిపి తో పొత్తు పెట్టుకుని గెలుపొందిన తర్వాత అటు టిడిపిని మోసం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. ఇక్కడి సంస్కృతిని మరిచిన వ్యక్తి కేటీఆర్ తను చదువుకున్నది కాంగ్రెస్ బడిలో, తను ఎక్కింది కాంగ్రెస్ బస్సు, చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కిన విమానం కూడా కాంగ్రెస్ దేనని, చివరికి వాళ్ళ అయ్య పుట్టి పెరిగింది కూడా కాంగ్రెస్ లోనే అని గుర్తు చేశారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అని, గతంలో టిడిపిలో టికెట్ కోసం కెసిఆర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళినప్పుడు తారకరామారావుగా పేరు మార్చారని ఎద్దేవా చేశారు. ఆయన పేరుకే గ్యారెంటీ లేదు, పార్టీకి గ్యారెంటీ లేదు కాని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల ను వక్రీకరించి మాట్లాడడం సరికాదన్నారు.  కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీలు ఎట్లా ఉద్యమవుతాయని బీ ఆర్ ఎస్ సన్నాసులు గ్యారెంటీ లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. అవినీతి అనకొండలను పెంచి పోషించడంలో ఎంతగానో అభివృద్ధి జరిగిందని వక్రీకరించారు. రాష్ట్రంలో అయ్యా, కొడుకు, అల్లుడు, కూతురు ఇలా నలుగురు మోపయ్యారని, జిల్లా కో నలుగురు, మండలానికో నలుగురు, ఊరుకో నలుగురు మోపయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో భూదందా,ఇంకొకరేమో ఇసుక దందా, మరొకడెమో దొంగ నోట్లలో, ఇంకొకడు ఎక్కడో దొరుకుతాడు అని తెలిపారు. ఆలీబాబా 40 దొంగల మాదిరిగా, ముఠా నాయకుని లాగా సారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరదేవరాజు, లింగాల భూపతి, వైద్య శివప్రసాద్, నేరేళ్ల నర్సింగం గౌడ్,మునిగల రాజు, చుక్క శేఖర్, చోట.భరత్, శ్రీనివాస్, వెంకటరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Spread the love