ఇమ్రాన్‌కు ఊరట ! 8 కేసుల్లో బెయిల్‌

ఇస్లామాబాద్‌ : మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు న్యాయ స్థానంలో పెద్ద ఊరట లభించింది. మార్చిలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన హింసకు సంబంధించిన 8 కేసుల్లో ఆయనకు యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఖాన్‌పై ఇస్లామాబాద్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఈ కేసులన్నీ నమోదయ్యాయి. మార్చి 18న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోని కోర్టులో ఇమ్రాన్‌ హాజరైనపుడు పోలీసులకు, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అప్పుడు ఈ కేసులను నమోదు చేశారు. ఈ ఘర్షణల్లో 25మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. యాంటీ టెర్రరిజం కోర్టుకు హాజరు కావడం కోసం మంగళవారం ఇమ్రాన్‌ లాహోర్‌ నుండి ఇస్లామాబాద్‌ వచ్చారు. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం కోర్టు 8 కేసుల్లో జూన్‌ 8 వరకు ఇమ్రాన్‌కు బెయిల్‌ మంజూరు చేసినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇమ్రాన్‌ భార్య తరపున న్యాయవాది ఖ్వజా హారిస్‌ కూడా కోర్టుకు హాజరై తాత్కాలిక బెయిల్‌ కోసం ఆర్ధించారు. అవినీతి నిరోధక సంస్థ నుండి ఆమెకు ఎలాంటి నోటీసు కూడా అందుకోలేదని విచారణ సందర్భంగా హారిస్‌ తెలిపారు. ఆ వాదన విన్న అనంతరం కోర్టు మే 31 వరకు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. సమాధానం కోరుతూ ఎన్‌ఎబికి లేఖ రాసింది. 5లక్షల డాలర్ల పూచీకత్తును కూడా సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

Spread the love