నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి కొత్త చీఫ్ వచ్చాడు. పీటీఐ అంతర్గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ లాయర్లలో ఒకరైన గోహర్ అలీ ఖాన్ విజయం సాధించారు. గోహర్ అలీ ఖాన్ ఇకపై పీటీఐ పార్టీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. దేశ రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. దాంతో, పీటీఐ పార్టీని నడిపించే నాయకుడి కోసం పార్టీలో ఎన్నిక చేపట్టారు. గోహర్ అలీ ఖాన్ ను పీటీఐ తదుపరి అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ నామినేట్ చేయగా… పాకిస్థాన్ ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆన్ లైన్ యాప్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పీటీఐ పాల్గొనాలన్నా, బ్యాటు గుర్తు నిలుపుకోవాలన్నా… పార్టీ అంతర్గత ఎన్నికలు జరిపి చైర్మన్ ను ఎన్నుకోవాల్సిందేనని పాక్ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.