సెంచరీ దాటిన ఇమ్రాన్‌ పార్టీ

సెంచరీ దాటిన ఇమ్రాన్‌ పార్టీ– పాక్‌లో ఎట్టకేలకు ముగిసిన ఓట్ల లెక్కింపు..
– ఇమ్రాన్‌ ‘అభ్యర్థుల’దే ఆధిపత్యం
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాల ను ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ‘పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ)’ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన ‘పీఎంఎల్‌-ఎన్‌’ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్‌ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’కి 54 సీట్లు లభించగా, ‘ఎంక్యూఎం-పీ’ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఇక్కడి జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే గురువారం ఎన్నికలు నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం 264 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ‘ఎన్‌ఏ-88’ సీటు ఫలితాలను నిలిపేసింది. పంజాబ్‌, సింధ్‌, ఖైబర్‌-పఖ్తుంక్వా ప్రావిన్సుల అసెంబ్లీల ఫలితాలూ వెల్లడయ్యాయి. బలూచిస్థాన్‌లోని మూడు నియోజకవర్గాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.పాక్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే ‘పీపీపీ’తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘పీఎంఎల్‌-ఎన్‌’ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు కలిసి రావాలని ‘పీటీఐ’ మినహా మిగిలిన పక్షాలకు పీఎంఎల్‌-ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ పిలుపునిచ్చారు. వాటితో చర్చించే బాధ్యతను సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌కు అప్పగించారు. నవాజ్‌కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడు ఆసీమ్‌ మునీర్‌ కూడా రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love