ఒక ఊరిలో…!!

In a village...!!సాయంత్రం ఏడు దాటింది. అడవిపల్లి ఊరి జనాలు ఎక్కడి వారు అక్కడే ఎవరెవరి ఇళ్లల్లో వాళ్లు ఉండిపోయారు. పని నిమిత్తం బయటికి వెళ్లిన వాళ్లు తొందర తొందరగా ఊర్లోకి చేరుకుంటున్నారు. సూర్యుడు అస్తమించి కూడా గంట సమయం దాటిపోయింది. చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. నేను ఒక్కడినే దారి వెంబడి నడుస్తున్నాను. ఏ చిన్నపాటి శబ్దం కూడా లేదు. లోపల భయం పుట్టుకుంది నాకు. వెనుకా ముందూ చూస్తూనే ఊరు సమీపించాను. పొదల మాటున ఏదో అలికిడి.. నన్ను ఎవరో అనుసరిస్తున్నట్టు పాదాల చప్పుడు వినిపించింది. ప్రాణాలతో ఇంటికి వెళతానో లేదోనని నాలో భయం మొదలైంది. పరిగెత్తడం మొదలుపెట్టాను. కాలర్‌ పట్టి వెనక్కి లాగుతూ నా వేగాన్ని ఎవరో నియంత్రిస్తున్నట్టు అనిపిస్తోంది. ఐనా కూడా శక్తి కూడదీసుకుని ఇంటి ప్రాంగణంలోకి చేరుకున్నాను.
ఇంటి తలుపు తట్టాను ఎంతసేపటికీ తీయలేదు. గట్టిగా అరచినట్టు పిలిచాను. అమ్మ తలుపు తీసి గురాయించి చూసింది నా వైపు. నాన్న చుట్ట తాగుతూ మంచం మీద కూర్చున్నాడు. ”ఇంత పొద్దు వరకు యాడ సచ్చినావురా.. చదువు లేకపాయే, చెప్పింది వినకపోతివి, పొద్దస్తమానం అల్లరి గుంపుని వెంటేసుకుని తిరుగుళ్ళకే సరిపోతాంది. ఏం బాగుపడతావో ఏమో” అంటూ గుడ్లప్పగించి చూస్తూ గట్టిగా మందలించాడు నాన్న.
”ఆశలన్నీ నీపైనే పెట్టుకున్నాం. ఇలా అల్లరిగా తిరిగితే ఎలా చెప్పు. ఏడు దాటితే ఊర్లో ఎవరి ప్రాణాలు పోతాయో కూడా తెలీదు. అమావాస్య దగ్గరపడుతోంది. ఇంత పొద్దుపోయే వరకు ఎందుకున్నావురా” అంటూ అమ్మ బాధపడింది.
”చదువు ఎలాగూ లేదు. విద్య నేర్పిస్తానంటే క్షణం కూడా కుదురుగా కూర్చోవు. మనకు తిండి పెట్టేది ఇదేరా” అంటూ నాన్న మంచం మీద నుండి లేచి లోపలికి నడిచాడు. ఆలోచిస్తూ కూర్చున్నాను. తాతల కాలం నుండి వస్తున్న ఈ మంత్ర విద్యనే నాన్న నేర్చుకుని ఆచరిస్తున్నాడు. మంత్రాల మారెన్న అంటే మా ఊరే కాదు, చుట్టుపక్కల కూడా మంచి పేరు సంపాదించాడు నాన్న. ఐనా కూడా ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. అందుకే ససేమిరా అనేవాణ్ణి ఈ కాలంలో కూడా ఇలాంటివి అవసరం లేదు అనుకున్నాను.

అమావాస్య రావడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. ఊర్లో జనాలు చర్చించుకుంటున్నారు… ”మన ఊరిని ఏదో శక్తి పట్టిపీడిస్తోంది” అరుగుపై కూర్చున్న ఒక పెద్దాయన అంటున్నాడు.
”ఇప్పటికే ముగ్గురు చనిపోయారు” అన్నాడు ఎదురుగా కూర్చున్న మీసాలాయన. ”అది ఎవరికీ స్పష్టంగా కనిపించదు. ఏదో వింత శబ్దాలు చేస్తూ ఒంటరిగా ఉన్న వారిపై విరుచుకుపడుతుంది. సాయంత్రం పూట ఊర్లోకి రావాలంటేనే భయం వేస్తోంది” పెద్దాయన అంటున్నాడు.
ఊరికి ఏమైందో తెలియదు. చీకటి పడగానే ఊరిోకి ఏదో విషవాయువు ప్రవేశిస్తోంది. రకరకాలుగా ఆకారాలు దాల్చుతూ మనుషుల్ని చంపుతోంది. ఇలా ఆలోచిస్తూ చెట్టు కింద ఒక్కడినే కూర్చుండిపోయాను. ”ఏరా.. వెంకటేశు.. చీకటి పడుతోంది ఇంటికి వెళ్లలేదా” అటుగా వెళుతున్న చాకలి తిప్పన్న అనగానే చటుక్కున తేరుకొని అక్కడి నుంచి లేచాను. ఆ ఊర్లో ఏ పని చేయాలన్నా ఏడు గంటల లోపే ముగించి ఇళ్లకు చేరుకోవాలి.

అనుకున్నట్టుగానే అమావాస్య రానే వచ్చింది. నాన్న మంత్ర వైద్యానికి సంబంధించిన వస్తువుల్ని రెడీ చేసుకుంటున్నాడు. సాయంత్రం దాటిపోయింది. చీకటి పడడానికి ఇంకా గంట సమయం పడుతుంది తలుపు తీసి బయటకి అడుగు పెట్టాను. ”ఎక్కడికి రా వెళుతున్నావ్‌” అమ్మ ప్రశ్న అడ్డు తగిలింది. ”అలా వెళ్ళొస్తానమ్మా” అన్నాను.
”అక్కర్లేదు. మనం పొలిమేరకు వెళ్లాలి. పెద్దారెడ్డి కోడలకు గాలి సోకిందంట. మూడు దారుల కూడలిలో పూజ చేయాలి” నాన్న అనగానే గుండెకాయ మోకాల్లోకి జారినట్టు అయింది. ”నేను రాను” తెగేసి చెప్పాను. ”నువ్వు రావాలి” అంటూ నాన్న హూకుం జారీ చేసినట్టు అన్నాడు.
రాత్రి తొమ్మిది దాటింది. నాన్న వెంట పొలిమేర వైపు నడుస్తున్నాను. సంచి భుజానకేసి నాన్న ముందు నడుస్తుంటే నేను వెనుక నడుస్తున్నాను. ఏదో అలికిడి వినిపించింది. నాన్న చప్పున ఆగిపోయాడు ఎవరో నడుస్తున్నట్టు కాళ్ల చప్పుడు. దారివైపు దృష్టి సారించాం. తెల్ల పంచె, తెల్లచొక్కా వేసుకున్న ఒకతను చేతిలో బ్యాగు పట్టుకొని వెళుతున్నాడు. ‘ఎవరబ్బా’ అనుకుంటూ వెళ్లాను.
రెండడుగులు వేసి దారివైపు చూశాను. ఎవరూ కనిపించలేదు. దారిలో నిలబడి చుట్టూ చూశాను. ఒకింత భయం వేసింది. అటు ఇటు చూస్తూ వెళుతున్నాను. నా వెనుక నుండి ఒక ఆకారం నన్ను అనుసరిస్తున్నట్టు అనిపించింది. భయపడుతూనే అడుగులు వేస్తున్నాను. కాస్త దూరంగా ఒక మనిషి కనిపించాడు. ‘ఈ సమయంలో ఎవరిక్కడీ’ అనుకుంటూ ఆ చీకట్లోనే తిన్నగా నడుస్తూ దగ్గరికి వెళ్లాను. ”ఎవరు నువ్వు?” అడిగాను. ఆ మనిషి వెనక్కి తిరగలేదు. ”అడుగుతుంటే వినిపించట్లేదా?” అన్నాను గట్టిగా. ”శవానికి మాటలు ఎందుకు వస్తాయిరా మూర్ఖుడా” కోపంగా అంటూ అదోరకం గొంతు.. భీతిగానే అతని చొక్కాను మెల్లగా తాకాను. అంతే ఒక్కసారిగా చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే వెనుక నుంచి ఏదో అరిచినట్టు శబ్దం. వెనక్కి తిరిగి చూసి తక్షణమే ముందుకు చూశాను. అతను నా ముందు లేడు. ఒక్క ఉదుట పరుగులు తీశాను. విషయం నాన్నతో చెప్పాలి అనుకుంటూ పరుగుతో వెళ్లి చూస్తే అక్కడ నాన్న లేడు. పూజ చేసిన ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
‘నాన్న ఎక్కడికి వెళ్ళాడు?’ మనసులో ఆవేదనతోపాటు ఆందోళన మొదలైంది. అదే పరుగుతో ఇంటికి వెళ్లాను. ”మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు” అమ్మ అనగానే దిక్కు తోచలేదు. మళ్లీ అదే స్థలానికి వెళ్లి వెతికాను. ఆచూకీ కనపడలేదు. రాత్రి కూడా ముగుస్తోంది, వేకువ చుక్క మొలిచింది. తూర్పు దిక్కున వెలుగు రేఖలు చిన్నచిన్నగా విచ్చుకుంటున్నాయి.
హడావిడిగా ఊర్లోకి వెళ్ళను. ఊర్లో జనాలందరూ నాగలికట్ట దగ్గరకు వెళ్తున్నారు. నేను కూడా వెళ్లాను. నాగలికట్ట చుట్టూ జనాలు గుంపులుగా నిలబడి ఉన్నారు. అందర్నీ తోచుకుంటూ లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యంతో పాటు బాధ వేసింది. నాన్నను పక్కనే ఉన్న కూసానికి కట్టేశారు.
”ఈ ఊర్లో క్షుద్ర పూజలు చేసేది నువు ఒక్కడివే. ప్రతి అమావాస్యకు మన ఊర్లో ఎందుకు ఇలా జరుగుతోంది. మర్యాదగా చెప్పు. ఒక్కొక్కరే చనిపోతున్నారు. ఎందుకు?” అంటూ ఊరు మొత్తం ఏకమై ప్రశ్నిస్తోంది. ”నిజంగా నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా నా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాను. ఊరు బాగు కోరతానే తప్ప చెడు కోరాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి నన్ను నమ్మండి” అంటూ ప్రాధేయపడుతున్నాడు నాన్న.
”నిన్ను ఎలా నమ్మమంటావు సాయంత్రం ఏడు దాటితే ఊర్లో ఎవరూ బయటికి రారు. నువ్వు మాత్రం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా బయటికి వెళతావు. ఆ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. మమ్మల్ని మాత్రమే ఎందుకు చంపుతోంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?” అంటూ ప్రశ్నల బాణాలతో గుచ్చుతున్నారు. ”నాకున్న విద్యతో నన్ను నేను కాపాడుకుంటూ జీవనం చేసుకుంటున్నాను. అంతేగాని ఆ రహస్యం ఏంటో నాకు కూడా తెలియదు” అంటూ తల వాల్చుకున్నాడు నాన్న. ”వీడికి మర్యాద ఇవ్వడం దండగ. ఊర్లోనే ఉంటే ఊరిని వల్లకాడు చేస్తాడు. గ్రామ బహిష్కరణ చేస్తే సరిపోతుంది” అంటూ మరుక్షణం మమ్మల్ని కట్టుబట్టతో ఊరు బహిష్కరణ చేశారు. ఊరి బయట దూరంగా వున్న చిన్నపాటి సత్రంలో తల దాచుకున్నాం. తిండి తిప్పలు కరువై అష్ట కష్టాలు పడ్డాం.
కొద్ది రోజులకు అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆరోజు రాత్రి చిన్నగా వర్షం పడుతోంది. అమ్మకు ఒళ్ళు నొప్పులతో పాటు కడుపు నొప్పితో అల్లాడిపోతోంది. నాన్న చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. మేలు కాలేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలంటే ఊర్లోకి తప్పనిసరి వెళ్లాలి. స్నేహితుడి సహకారంతో ఆటోలో బయలుదేరాం. దారి మధ్యలో ఉన్నట్టుండి ఆటో ఆగిపోయింది. హోరున గాలివీస్తోంది. మెరుపుల జోరు ఎక్కువగా ఉంది. నేనూ నాన్నా ఆటో దిగాం. నాన్న నా వెనుక నిలుచున్నాడు. ”ఇప్పుడు ఎలా చేద్దాం నాన్న” అంటూ వెనక్కి తిరిగి చూస్తే నాన్న లేడు. వెతకడం మొదలుపెట్టాను. నాన్న జాడ కనిపించలేదు. పడమటి దిక్కున ఏదో అలికిడి రాగానే అటువైపు కదిలాను. నాన్న చెప్పులు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళ్లాను. నాన్న చొక్కా ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది. అంత వర్షంలో కూడా పెదవులపై తేమ ఆరిపోయింది నాకు. కాస్త ముందుకెళ్ళి చూస్తే చిధ్రమైన శరీరంతో నాన్న శవం ముక్కలుగా కనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. గట్టిగా అరవాలనిపించినా అరవలేక పోతున్నాను.
అంతలోపే వెనుక ఏదో శబ్దం రాగానే పరుగుతో వెనక్కి వెళ్లాను. ఆటోలో పడుకున్న అమ్మ కనిపించలేదు. వెతుకుతూ వెళ్తుండగా కాలికి మెత్తగా ఏదో తగిలినట్టు అవగానే కిందికి చూశాను. మెరుపు వెలుగులో అమ్మ విగతజీవిగా పడుండడం స్పష్టంగా కనిపించింది. నా కన్నీళ్లు వర్షపు నీటిలో కలిసిపోతున్నాయి. శవాలను తీసుకువెళ్లడానికి కూడా పనికి రాకుండా ఐపోయాయి. ఇక్కడే ఉంటే నాకు కూడా ప్రమాదం తప్పదనుకొని దేవునిపై భారం వేసి ఆటో తీసుకొని తిరిగి సత్రం చేరుకున్నాను.
కొన్నాళ్లు గడిపేశాను. ఒకరోజు స్వామీజీ ఊర్లోకి వెళ్ళాడు. గ్రామానికి శాంతి పూజ చేయాలని గ్రామస్తులకు చెప్పాడంట. ”గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవించాలంటే గ్రామానికి పూజ చేయాలి, హోమం జరిపించాలి. సమీపంలో ఉన్న అడవిలో ఒక మూలికా చెట్టు ఉంది. దాని వేరు పెకిలించుకుని తీసుకురావాలి. ఆ పని అవివాహితులే చేయాలి. ఎవరైనా ముందుకు వస్తారా?” అడిగాడు స్వామీజీ. తమ బిడ్డల్ని పంపడానికి ఎవరూ సాహసం చేయలేదు. ”ఉన్నాడు కదా మంత్రాల మారెన్న కొడుకు. వాన్ని పంపుదాం” అని ఒకరంటే, ”వాడికి ఎలాగూ అమ్మానాన్న లేరు, వాళ్లు ఊరికి చేసిన ద్రోహానికి మట్టి కొట్టుకుపోయారు. వీడు ఒక్కడుండి ఏం లాభం. వీన్నే పంపుదాం” అని కఠినంగా మాట్లాడారంట కొందరు. చివరికి నా దగ్గరికి వచ్చారు. ”ఊరి విషయంలో మీ నాన్న ఎలాగూ పాపం కట్టుకున్నారు. నువ్వైనా పుణ్యం కట్టుకో” అంటూ ఒకామె అంది. ”ఆగండి.. వీళ్ళ కుటుంబం ఊరికి ఎటువంటి చెడూ తలపెట్టలేదు. మీరే పొరపాటుగా అపార్థం చేసుకున్నారు. మీ ఊరిని ఇతను ఒక్కడే కాపాడగలడు” అని స్వామీజీ అనగానే అందరూ నా వైపు చూశారు. స్వామి చెప్పిన ప్రకారం ఉత్తర దిశగా ఉన్న అడవిలోకి బయలుదేరి వెళ్లాను.
స్వామీజీ చెప్పిన మూలికా చెట్టు కోసం అన్వేషణ ప్రారంభించాను. వెళ్తుండగా ఒక ముళ్ళ పొదల మాటున ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వచ్చింది. అటు దిశగా కదిలాను. ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న రాతి గుండు ఎక్కి దిక్కులు పరికించాను. తూర్పుముఖంగా ఎవరో నలుగురు నిలబడి ఉన్నట్టు కనిపించింది. అటువైపుగా నడక సాగించాను. తీరా వెళ్లి చూస్తే అక్కడ ఒక మంత్రగాడు పూజలు చేస్తూ కనిపించాడు. ”అడవిపల్లిలో ఇక నలుగుర్ని చంపితే మన పని పూర్తవుతుంది. ఈరోజు రాత్రే ఆ పని పూర్తి చేయాలి” అంటూ శిష్యులకు చెబుతున్న మంత్రగాని మాటలకు ఆశ్చర్యపోయాను. ‘ఏ దయ్యం లేదు భూతం లేదు. అంతా వీడు చేస్తున్న పనే అన్నమాట’ మనసులో అనుకొని ధైర్యంగా వాడి ముందుకు వెళ్లాను. నాపై దాడికి యత్నించారు. వాళ్లను నిలువరించడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐనా చేశాను. మంత్రగాన్ని ఒడిసి పట్టుకున్నాను నాలుగు పిడిగుద్దులు గుద్దేపాటికి అదుపులోకి వచ్చాడు నేరుగా ఊర్లోకి లాక్కెళ్ళాను.
ఊరి వాళ్ళ సమక్షంలో అతన్ని చెట్టుకు కట్టేసి ”మన ఊర్లోకి ఏ దెయ్యం, భూతం రాలేదు. అంతా వీడు చేస్తున్న పనే. దేనికోసం మనుషుల్ని చంపుతున్నాడో వీడితోనే కక్కించాలి” అన్నాను. ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అడవిపల్లి చుట్టూ పాత బడిన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటి కింద ధనం ఉంటుందన్న ఆశతో రాత్రిపూట ఎవరినీ బయటికి రానివ్వకుండా నిర్ధాక్షణంగా ప్రాణాలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు మాంత్రగాడు. తన పనికి ఎవరూ అడ్డు రాకూడదని ఈ దెయ్యాల పుకారు పుట్టించాడు. గ్రామస్తులు వాటికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. మాపట్ల చేసిన తప్పిదానికి పశ్చాత్తాప్పడుతూ నన్ను మళ్ళీ చేరదీశారు రివాళ్లు. ‘మంచితనం ఎప్పటికైనా బతుకుతుంది. చెడు ఏనాడైనా బయటపడుతుంది. మూఢనమ్మకాలు వదిలేసి అందరూ సంతోషంగా ఉండండి’ అంటూ విశ్రమించారు స్వామీజీ .

– నరెద్దుల రాజారెడ్డి, 9666016636

Spread the love