– రూ.45 వేల కోట్ల ఎల్‌ఐసి వాటాలు
ముంబయి : అదానీ గ్రూపు కంపెనీల స్టాక్స్‌ల్లో ఎల్‌ఐసి వాటాల విలువ రూ.45,000 కోట్లకు పైగా చేరింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూపులోని ఎల్‌ఐసి మార్కెట్ విలువ రూ.6,200 కోట్లు పెరగడంతో.. మొత్తం పెట్టుబడుల విలువ రూ.45,481 కోట్లుగా నమోదైంది. ఈ విలువను 2023 మార్చి ముగింపు నాటి నుంచి మంగళవారం వరకు లెక్కించారు. అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతోందని ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఆ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఆ క్రమంలోనే ఎల్‌ఐసి కూడా భారీగా నష్టపోయింది. అయినప్పటికీ అదానీ గ్రూపులో పెట్టుబడులు కొనసాగించడం గమనార్హం. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ స్టాక్స్‌లో ఎల్‌ఐసికి రూ.14.145 కోట్లు విలువ చేసే 9.12 శాతం వాటా ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.12,017 కోట్లు విలువ చేసే 4.25 శాతం వాటాలు, అదానీ టోటల్ గ్యాస్‌లో రూ.10,500 కోట్లు విలువ చేసే పెట్టుబడులను కలిగి ఉంది. అదానీ ట్రాన్స్‌మిషన్, అంబూజా సిమెంట్, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్‌ల్లోనూ ఎల్‌ఐసి పెట్టుబడులు భారీగానే ఉన్నాయి.