– ఇండియా జస్టిస్ రిపోర్టు 2025
– యూపీ, గుజరాత్‌ల్లో పరిస్థితి మరీ ఘోరం
న్యూఢిల్లీ : దేశంలో ఏ ఒక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం కూడా తమ పోలీసు శాఖలో నిర్ధేశించిన మహిళా కోటాను పూర్తిగా భర్తీ చేయలేదు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 2025 స్పష్టం చేసింది. అలాగే దేశంలో 20.3 లక్షల పోలీస్ సిబ్బంది ఉంటే వీరిలో సీనియర్ పోజిషన్లలలో మహిళలు 1000 కంటే తక్కువ మందే ఉన్నారని నివేదిక పేర్కొంది. జైళ్లు, న్యాయవ్యవస్థ వంటి అంశాల్లో తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటే.. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని నివేదిక పేర్కొంది.
ఐజేఆర్ అనేది న్యాయం అందించడంలో రాష్ట్రాల పనితీరుపై విశ్లేషణ చేస్తుంది. ప్రధానంగా పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయసహాయం అనేక అంశాల్లో రాష్ట్రాల పనితీరుపై విశ్లేషణ చేస్తుంది. ఇందుకోసం వివిధ భాగస్వామ్యులు, పౌర సమాజ సంఘాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఐజెఆర్ 2025 నివేదిక ప్రకారం దేశంలోనే ఉత్తరప్ర్రదేశ్ జైళ్లల్లో అత్యధికంగా ఖైదీల రద్దీ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో హైకోర్టు జడ్జిల పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఇక ఢిల్లీ జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీల్లో 91 శాతం మంది విచారణ ఖైదీలే. అలాగే గుజరాత్‌లో హైకోర్టు జడ్జిలు, సిబ్బందిలో అత్యధిక ఖాళీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
కర్నాటక బెస్ట్
పోలీసు, న్యాయవ్యవస్థ రెండింటిల్లోనూ మహిళా కోటా రిజర్వేష్లను పూర్తిగా భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా కర్నాటక నిలిచిందని నివేదిక ప్రశంసించింది. ఇక బీహార్‌లో పోలీసు విభాగంలో మహిళల సంఖ్య అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. అయితే ఈ రాష్ట్రంలో ట్రయిల్, జిల్లా కోర్టుల్లో 71 శాతం కేసులు మూడేళ్లకు పైగా విచారణ సాగుతోందని విమర్శించింది.
ఇక దేశంలో 17 శాతం పోలీస్‌స్టేషన్లలో కనీసం ఒక్క సీసీటీవీ కూడా లేదని, ఇక ప్రతీ 10 పోలీస్‌స్టేషన్లలో మూడింటిలో మహిళా హెల్ప్ డెస్కులు లేవని తెలిపింది. ఇక జైళ్లు, న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం నామమాత్రంగా ఉంటుందని నివేదిక తెలిపింది. ఇక ఒక్కొక్క ఖైదీపై చేస్తున్న ఖర్చు 2032-22లో రూ. 38,028 ఉండగా, 2022-23లో ఇది రూ.44,110కు పెరిగింది. 2022-23లో దేశం లోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ఖైదీపై రూ. 2,67,673 ఖర్చు చేశారు. ఏ రాష్ట్రం కూడా న్యాయవ్యవస్థపై తన వార్షిక ఆదాయంలో 1 శాతాని కంటే ఎక్కువ ఖర్చు చేయలేదు. నివేదిక ప్రకారం పోలీసులపై జాతీయ తలసరి ఖర్చు రూ. 1,275గా ఉంది. దేశంలో 831 మందికి ఒక సివిల్ పోలీస్ ఉన్నారు. ఇక, ఆరుణాచల్ ప్రదేశ్‌లో 2023లో తొలిసారిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకూ కూడా కమిషన్‌కు క్రీయాశీల వెబ్‌సైట్ లేదని నివేదిక విమర్శించింది.
జైళ్ల నిర్వహణలో తమిళనాడుకి అగ్రస్థానం
ఐజేఆర్ 2025 నివేదిక ప్రకారం జైళ్ల నిర్వహణలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. జైళ్ల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపులు పెంచడం, 100 శాతం వినియోగంతో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే జైళ్ల సిబ్బంది ఖాళీలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్కో అధికారికి 22 మంది ఖైదీలు మాత్రమే ఉన్నారు. దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులోనే అధికారులకు తక్కువ పనిభారం ఉంది. అయితే పోలీస్ విభాగానికి మాత్రం తమిళనాడులో బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది.