ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లపై వేటు

ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందన్న– పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్ని సస్పెన్షన్‌
– నటి జత్వానీ అరెస్ట్‌ వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాలు
అమరావతి : ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్‌ ఐపీిఎస్‌ అధికారులపై వేటు వేసింది. ప్రస్తుతం వెయిటింగ్‌లో వున్న మాజీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, మాజీ విజయవాడ సిటీ పోలీస్‌కమిషనర్‌ కాంతిరాణా టాటా, మాజీ విజయవాడ డిసిపి విశాల్‌ గున్నిను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జిఓ నంబర్‌ 1590, 1591,1592ను ఆదివారం విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఎసిపి హనుమంతరావులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర డీజీపీి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైసీపీి నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఒక పారిశ్రామికవేత్తపై ముంబయిలో తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే ముంబాయిలో వున్న తనను 7.30 గంటలకు తల్లిదండ్రులతోపాటు అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె తెలిపారు. పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, తనను వేధించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకొని తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని కాదంబరి జెత్వాని ఫిర్యాదులో వివరించారు. ఐపీిఎస్‌ అధికారులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణకు డీజీపీి తిరుమల రావు ఆదేశించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు జరిపిన విచారణలో ఈ వ్యవహరంలో అనేక లొసుగులు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయన నివేదిక రూపొందించి డీజీపీిికి అందజేశారు. దీని ఆధారంగా డీజీపీి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉన్నతస్థాయిలో ఉన్న ఐపిఎస్‌ అధికారులు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో వివరించారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆ అంశాలనే పేర్కొంటూ ఒక్కో అధికారి పేరుతో విడివిడిగా జిఓలు జారీ చేసింది.
పిఎస్‌ఆర్‌ ఆంజనేయులును సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జిఓలో ఆయన జనవరి 31న విజయవాడ సిటి కమిషనర్‌ కాంతిరాణా టాటా, డీసీపీి విశాల్‌గున్నిని సీిఎంఓకు పిలిపించి ముంబాయిలో వున్న సినీనటి కాదంబరి జత్వానిని అరెస్ట్‌ చేయాల్సిందిగా, మౌఖికంగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఆయన పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు జిఓలో తెలిపారు. ‘ఆధారాలు లేకుండా, అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదును ఆధారంగా తన ఉద్యోగ హోదాను అడ్డుపెట్టుకుని ఆదేశాలు జారీ చేశారు’ అని పేర్కొన్నారు.

Spread the love