ఎన్ని సిత్రాలో..!

In many Sitra..!– ఆశ్చర్యం కలిగిస్తున్న ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలు
– ప్రత్యర్థి పార్టీలకూ నిధులు సమకూర్చిన రాజకీయ నాయకులు, వారి సంస్థలు
– ‘ప్రత్యేక చర్యల ప్రభావం’తో మరికొన్ని కంపెనీలు
– ఆసక్తిగా మారిన హైదరాబాద్‌ కంపెనీల విరాళాలు
– ‘క్విడ్‌ ప్రోకో’పై సర్వత్రా చర్చ
రాజకీయ పార్టీలకు విరాళాలనందించే ఎలక్టోరల్‌ బాండ్ల పథకంపై పూర్తి వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పూర్తిగా బహిర్గతపర్చటంతో పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక సంస్థ, కంపెనీ, వ్యాపారవేత్త.. ఇలా ఎవరైనా తమకు నచ్చిన, తాము మెచ్చిన సిద్ధాంతం కలిగిన రాజకీయ పార్టీలు, నాయకులకు విరాళాలు ఇవ్వటం సాధారణం. ఇక, ఒక రాజకీయ నాయకుడు, వారికి చెందిన కంపెనీలు, సంస్థలు ఇచ్చే విరాళాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాము ఏ పార్టీలో క్రియాశీలంగా ఉంటారో.. ఆ పార్టీకే విరాళాలు అందిస్తారు. కానీ, ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలను బట్టి చూస్తే ఇందుకు భిన్నంగా కూడా కనిపిస్తున్నది.
న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, వారి సంస్థలు ప్రత్యర్థి పార్టీలకు సైతం విరాళాలు ఇచ్చిన ఘటనలు బాండ్ల వ్యవహారంలో కనిపించాయి. మరికొన్ని సంస్థలు ‘ప్రత్యేక చర్యల’ ప్రభావంతో రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చాయి. చూడగలిగితే ఎన్ని చిత్రవిచిత్రాలో…!
హైదరాబాద్‌ కంపెనీల నుంచి బీజేపీ, బీఆర్‌ఎస్‌కు అధిక విరాళాలు
ఉదాహరణకు.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంబంధం ఉందని హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మకు చెందిన పి. శరత్‌ చంద్రారెడ్డిని.. 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీలోకి తీసుకున్నది. ఆ తర్వాత ఐదు రోజులకే అరబిందో ఫార్మా.. బీజేపీకి రూ. 5 కోట్లను విరాళంగా అందించింది. అలాగే, ఇదే వివాదాస్పద లిక్కర్‌ కేసులో శరత్‌ అప్రూవర్‌గా మారిన తర్వాత మరో రూ.25 కోట్లు బీజేపీకి చేరాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే కంపెనీల్లో ఎక్కువ బీజేపీ, బీఆర్‌ఎస్‌కే విరాళాలు అందించాయి. ఒక్క ‘మేఘా’ గ్రూపే బీజేపీకి ఏకంగా రూ.664 కోట్ల నిధులను అందించింది. రాజకీయ నాయకులుగా మారిన మరికొందరు వ్యాపారవేత్తలు.. పార్టీలతో నిమిత్తం లేకుండా విరాళాలు అందించారు. అలాగే, బీఆర్‌ఎస్‌ నాయకులకు చెందిన కంపెనీలు ఇరత రాజకీయ పార్టీలకు సైతం విరాళాలిచ్చాయి. ఒక బీజేపీ నాయకుడు కాంగ్రెస్‌ నాయకుడికి, మరొక నాయకుడు ఈ రెండు పార్టీలకూ నిధులందించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. బీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌.. బీఆర్‌ఎస్‌కు రూ.20 కోట్లు, బీజేపీకి రూ.18 కోట్లు డొనేట్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన హెటిరో గ్రూపు.. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.10 కోట్లు సమకూర్చటం గమనార్హం.
కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ సంస్థ నుంచి విరాళం
బీజేపీ ఎంపీ సీ.ఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌.. కాంగ్రెస్‌కు రూ.3 కోట్లు విరాళం అందించింది. ఇక రియల్‌ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ కంపెనీలైన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌), మై హౌం గ్రూప్‌, రాజపుష్ప, వాసవి, సంధ్య, వంశీరామ్‌, ఇతర కంపెనీల నుంచి బీఆర్‌ఎస్‌కు అధిక విరాళాలు అందాయి. ఇందులో కొన్ని కంపెనీలైతే బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుల సన్నిహితులకు చెందినవే కావటం గమనార్హం. వీటితో పాటు కొన్ని ప్రముఖ ఫార్మా కంపెనీలైన డాక్టర్‌ రెడ్డిస్‌, దివిస్‌ ల్యాబ్‌, సన్‌, అరబిందో, హెటిరో వంటివి బీఆర్‌ఎస్‌, బీజేపీలకు రూ.5 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు విరాళాలు అందించాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఇలా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది. ఇందులో ‘క్విడ్‌ ప్రొ కొ(నీకిది, నాకది)’ అనేది ఏమైనా దాగి ఉండొచ్చనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Spread the love