– ‘ఉపా’ కేసులో విచారణ కోసం ఎదురు చూస్తున్న ఉమర్ ఖాలీద్
– 2020 సెప్టెంబర్‌లో అరెస్టయిన జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు నాలుగేండ్లుగా జైలులోనే మగ్గుతున్నాడు. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కేసులో విచారణ కోసం ఎదురు చూస్తున్నాడు. 2020లో ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న మతపరమైన అలర్లకు సంబంధించి ఉమర్ ఖాలీద్ ఆ ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన విషయం విదితమే. అయితే, ఆయన అప్పటి నుంచి జైలులోనే శిక్షను అనుభవిస్తున్నాడు. విచారణ కోసం ఇలా ఆయన నాలుగేండ్ల విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో హింసాత్మక అల్లర్ల ఆరోపణలపై డిసెంబర్, 2022లో న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయినప్పటికీ, ఉపా కింద దాఖలైన ఇంకో కేసులో ఆయన జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు సందర్భాల్లో బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలనూ కోర్టులు తిరస్కరించాయి కూడా. ఉపా చట్టంలోని పలు నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును కూడా సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. అది కూడా పెండింగ్‌లో ఉన్నది.