మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ

మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ– డమ్మీ అభ్యర్థిని పెట్టిన కాంగ్రెస్‌
– రేవంత్‌ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు
– ఈటల రాజేందర్‌ కేంద్రం నుంచి రూపాయి తేలేదు: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ -శామీర్‌ పేట
” సీఎం రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కేంద్రం నుంచి రూపాయి తేలేదు.. కాంగ్రెస్‌ నుంచి డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టారు. అందువల్ల ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది” అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మంగళవారం శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తాలోని సీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మేడ్చల్‌ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బలపర్చిన మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. 25 ఏండ్లుగా రాగిడి లక్ష్మారెడ్డి అనేక ప్రజా సేవా కార్యక్రమాలు చేశారని, కేసీఆర్‌ గుర్తించి ఆయనకు ఎంపీ టికెట్‌ ఇచ్చారని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధే లక్ష్మారెడ్డిని గెలిపిస్తుందని చెప్పారు. పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్‌ ఓట్లు అడగాలన్నారు. రుణమాఫీ చేయలేదని ఈటల రాజేందర్‌ మాట్లాడుతున్నారని.. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్‌ రూ.16 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. తూంకుంట నుంచి జేబీఎస్‌ వరకు, గుండ్ల పోచంపల్లి నుంచి ప్యారడైస్‌ వరకు స్కైవే కోసం అనేక సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ కృషి చేసిందని, ఆ ఫలితమే ఇటీవల దానికి ఆర్డర్‌ కాపీ వచ్చిందని తెలిపారు. అయితే, దానిని తానే సాధించినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లక్షా 62,283 మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. ఇన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదని చెప్పారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామన్నారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు మీరు ఎప్పుడు నోటిఫికేషన్‌ వేశారని ప్రశ్నించారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలుపుకోవాలని సూచించారు. అలాగే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, నెల నెలా మహిళలకు ఇస్తానన్న రూ.2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యాలని.. మిగతా వాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సూచించారు.మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. దమ్మున్న పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అని, కాంగ్రెస్‌, బీజేపీకి క్యాడర్‌ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చాక ఇండ్లు, ఫంక్షన్‌ హాళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌లోకి రావాలని.. లేదా మీరు కట్టుకున్న బిల్డింగ్‌లు కూలగోడతామని కాంగ్రెస్‌ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాను 25 ఏండ్లుగా చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి కేసీఆర్‌ తనకు ఎంపీ టికెట్‌ ఇచ్చారని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధి ఘనత కేటీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మెన్‌ మధుకర్‌ రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌, ఎంపీపీ ఎల్లుభాయిబాబు, జెడ్పీటీసీ అనితలాలయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మెన్‌లు, వైస్‌ చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love