– అరకొర వసతుల్లోనే జ్యోతిబాపూలే పాఠశాలలు
– కోళ్లఫారాలు, స్టేడియంలు, ప్రయివేటు భవనాల్లోనే నిర్వహణ
– మౌలిక వసతుల్లేక విద్యార్థుల అవస్థలు
– ఐదేండ్ల నాటి మెనూయే ఇప్పటికీ అమలు
– ప్రభుత్వం దృష్టి సారించాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీల గురుకులాలతోపాటు వెనుకబడిన తరగతుల వారి పిల్లల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలను ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుపై ప్రారంభంలోనే సరైన ప్రణాళిక లేకపోవడంతో అన్నీ సమస్యలే నెలకొన్నాయి. నిర్వహణ లేదు.. పక్కా భవనాలు నిర్మించలేదు. ప్రయివేటు భవనాలు, కోళ్లఫారాల్లో పాఠశాలలను కొనసాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మెనూ సమస్యలు వెంటాడుతున్నాయి. భోజనం దగ్గర నుంచి.. చదువు, మౌలిక సదుపాయాలు ప్రతిదీ సమస్యగానే ఉన్నాయి. బీజీ గురుకులాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలున్నా.. పేదరికం మూలాన తమ పిల్లలను ప్రభుత్వ గురుకులాల్లోనే తల్లిదండ్రులు చదివిస్తున్నారు.
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా 350 మహత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు ఉన్యాయి. వీటిలో 280 పాఠశాలలు ప్రయివేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మిగతావి కూడా ఇతర ప్రభుత్వ రంగాల కోసం ఏర్పాటు చేసిన భవనాల్లో తాత్కాలికంగా నడిపిస్తున్నారు. వీటిలో లక్షా 68 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో పాఠశాలలో 16 మంది ఉపాధ్యాయుల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5600 మంది ఉన్నారు. బోధనేతర సిబ్బంది 2100 మంది పనిచేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 పాఠశాలలున్నాయి. రెండే పాఠశాలలకు పక్కా భవనాలు ఉన్నాయి.. మిగతావి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రయివేటు భవనాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఐదేండ్ల కిందటి మెనూ..
ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదేండ్ల కిందట నిర్ణయించిన మెనూనే ఇప్పటికీ అమలవుతోంది. ఈ ఐదేండ్లలో నిత్యావసరాల సరుకుల ధరలు రెండు మూడింతలు పెరిగాయి. అయినా ప్రభుత్వం మెనూ పెంచడం లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దృష్టిసారించలేదని తెలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు ఒక విద్యార్థికి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రూ.950 మాత్రమే మెనూను ప్రభుత్వం ఇస్తోంది. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు నెలకు రూ.1100 ఇస్తోంది. ఇందులోనే రైస్‌తో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్ ఇవ్వాల్సి ఉంది. నెలలో రెండ్రోజులు రోజుకు 50 గ్రాముల చొప్పున మటన్, నాలుగు రోజులు 100 గ్రాముల చొప్పున చికెన్ పెడతారు. కాస్మోటిక్ చార్జీల కింద విద్యార్థికి నెలకు రూ.113 ఇస్తున్నారు. సబ్బులు, కొబ్బరినూనె తదితర ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరుకు గదుల్లో చదువు
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలో బీసీ విద్యార్థుల కోసం మహత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను ప్రయివేటు వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలను ‘నవతెలంగాణ’ పరిశీలించింది. ఇక్కడ 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికోసం 24 మరుగుదొడ్లు ఉన్నాయి. అవి అందరికీ సరిపోక.. బహిర్భూమి కోసం ఆరుబయటకు వెళ్తున్నారు. వర్షం, గాలి వచ్చినప్పుడు విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కిటికీలు, తలుపులు సైతం అంతంత మాత్రమే ఉన్నాయి. ఇదే పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు మహత్మాజ్యోతిబా పూలే బాలికల పాఠశాలలోనూ ఉంది. ఇక్కడ ఐదు నుంచి 10 తరగతులకు 480 మంది ఉన్నారు. ఇక్కడ కూడా ప్రయివేటు భవనం కావడం చేత టాయిలెట్లు, స్నానపు గదుల సమస్య తీవ్రంగా ఉంది. పెబ్బేరు మండల కేంద్రంలోని బీసీ గురుకులంలో 188 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇరుకు గదులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రహరీ గోడలు లేక.. బిక్కుబిక్కుమంటున్నారు.
పక్కా భవనాలు నిర్మించాలి
జ్యోతిబా పూలే పాఠశాలలకు పక్కా భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలలు కోళ్లపారాలు, స్టేడియాల్లో నడిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జ్యోతిబా పూలే పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి. పెరిగిన ధరలకు అనుకూలంగా మెనూకు బడ్జెట్ పెంచాలి.
ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్‌నగర్
ఇక్కడ మౌలిక వసతులు బాగున్నాయి..
మౌలిక వసతులు బాగానే ఉన్నాయి. టాయిలెట్లు, నీటి సమస్యలు ఏమీ లేవు. పక్కా భవనం నిర్మిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది. బీసీల కోసం ఏర్పాటు చేసిన జ్యోతిబా పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతున్నాం.
ప్రశాంతి, ప్రిన్సిపాల్, జ్యోతిబా పూలే వెనకబడిన పాఠశాల, తెలకపల్లి