ఐదవ దశ పోలింగ్‌లో 23 శాతం మంది నేరచరితులే

In the fifth phase polling, 23 percent were criminals– క్రైం రికార్డ్స్‌, సంపన్నుల్లోనూ బీజేపీ అభ్యర్థులదే అగ్రస్థానం
– ముగ్గురు అత్యంత ధనవంతులు
– ఒక్కరు మినహా, అందరి వద్ద కోటి పైగా ఆస్తి
న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో.. 20 న ఐదవ దశ పోలింగ్‌ నిర్వహించటానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.ఎన్నికల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వీరు దాఖలు చేసిన నామినేషన్‌లలో ప్రస్తావించిన అంశాలతో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. అభ్యర్థుల ఆస్తుల వివరాలతో పాటు నేర చరిత్ర, తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి.
ఐదవ దశలో జమ్మూ, కాశ్మీర్‌, బీహార్‌, లఢక్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఇరవై మూడు శాతం మంది (అంటే 159 మందిపై) క్రిమినల్‌ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పొందుపర్చారు. 122 మంది (అంటే 18 శాతం మంది) అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్టు గుర్తించారు. గరిష్టంగా ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపింది. నాన్‌ బెయిలబుల్‌, సర్కారు ఆస్తులకు నష్టాన్ని కలిగించిన నేరచరితులు ఉన్నారు. తీవ్రమైన నేరాలలో దాడి, హత్య, కిడ్నాప్‌, లైంగికదాడికి సంబంధించిన కేసులూ ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద నేరాలు, మహిళలపై నేరాలు కూడా ఇందులో ఉన్నాయి.
నేరాలిలా…
ఈ నివేదిక ప్రకారం, ఐదవ దశలో ముగ్గురు అభ్యర్థులు దోషులుగా నిర్ధారించిన కేసులున్నాయి. నలుగురు అభ్యర్థులు తమపై హత్య కేసులు నమోదైనట్టు తెలిపారు. 28 మంది అభ్యర్థులు హత్యాయత్నానికి సంబంధించిన కేసులను ప్రకటించగా, 10 మంది తమపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయని పేర్కొన్నారు. మహిళలకు సంబంధించిన కేసులలో 29 మంది అభ్యర్థులు దోషులుగా ఉన్నట్టు తెలిపారు. ఒక అభ్యర్థిపై లైంగిక దాడికి సంబంధించిన కేసు ఉన్నట్టు అఫిడవిట్‌లో పొందుపరచటం విశేషం.
ప్రధాన పార్టీకి చెందిన వారి వివరాలు తీసుకుంటే.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన పది మంది అభ్యర్థులలో ఐదుగురు, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురిలో ముగ్గురు అభ్యర్థులు అసదుద్దీన్‌ ఒవైసీ నేతత్వంలోని మజ్లిస్‌ పార్టీకి చెందిన నలుగురిలో ఇద్దరు అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల్లో 19 మంది, కాంగ్రెస్‌కు చెందిన 18 మందిలో ఎనిమిది మంది, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కు చెందిన ఏడుగురిలో ముగ్గురిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఉద్దవ్‌ ఠాక్రేకు చెందిన శివసేనలో ఎనిమిది మందిలో ముగ్గురు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన నలుగురిలో ఒకరు, బిజు జనతాదళ్‌(బీజేడీ)కు చెందిన ఐదుగురిలో ఒక అభ్యర్థిపై నేర చరిత్ర ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. ఈ నివేదిక మొత్తం 49 నియోజకవర్గాల్లోని ఇరవై ఆరింటిలో రెడ్‌ అలెర్ట్‌ ఉందని, ఈ ప్రాంతాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది క్రిమినల్‌ కేసులు కలిగి ఉన్నారని తెలిపింది.
33 శాతం మంది కోటీశ్వరులే..
695 మంది అభ్యర్థుల్లో 227 మంది అంటే 33 శాతం మందికి రూ.కోటి పైనే ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది అభ్యర్థులు, ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేనలోని ఆరుగురు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన నలుగురు, శరద్‌పవార్‌కు చెందిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరు అభ్యర్థులు కోటిపైనే ఆస్తులున్నట్టు వెల్లడించారు. బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల్లో 36 మంది, ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన వర్గానికి చెందిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఏడుగురు, తణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు అభ్యర్థుల్లో ఆరుగురు, కాంగ్రెస్‌కు చెందిన 18 మంది అభ్యర్థుల్లో 15 మంది రూ. 1 కోటిపైనే ఆస్తులు ఉన్నట్టు ఆఫిడవిట్‌ దాఖలు చేశారు. బిజూ జనతాదళ్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు, మజ్లిస్‌కు చెందిన నలుగురిలో ఇద్దరు అభ్యర్థులు కోటి రూపాయలకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారని విశ్లేషించారు.
అత్యంత సంపన్నులుగా ముగ్గురు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి అనురాగ్‌ శర్మ రూ. 212 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన నీలేష్‌ భగవాన్‌ సాంబరే రూ. 116 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. ముంబై నార్త్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్‌ గోయల్‌ రూ. 110 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.కాగా, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్న మహ్మద్‌ సుల్తాన్‌ గనై అత్యల్పంగా ప్రకటించిన ఆస్తులు రూ.67 మాత్రమే.

Spread the love