జీఎస్టీ ప్రస్థానంలో సామాన్యులే సమిధలు

దేశ పరోక్ష పన్నుల చారిత్రాత్మక గమనంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా రూపొందించి ‘ఒకే దేశం-ఒకే పన్ను’ నినాదంతో కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చినదే ‘గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌’ (జీఎస్‌టీ). ఈ విధాన రూపకల్పన ప్రస్థానం 2023 జూన్‌కు ఆరేండ్ల కాలాన్ని, జులై 11వ తేదీతో 50 జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలను పూర్తిచేసు కుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ”జీఎస్‌టీ కౌన్సిల్‌ – ప్రయాణం దిశలో 50 అడుగులు” అనే లఘు చిత్రాన్ని విడుదల చేశారు. వినడానికి ఎంతో వినసొంపుగా అనిపించినప్పటికీ దీని ప్రవేశిక మొదలు నుంచి నేటివరకు కూడా జీఎస్టీ మొత్తంలో సామాన్యులే సమిధలని చెప్పక తప్పదు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు (101వ సవరణ చట్టం) ద్వారా 2016లో జీఎస్టీ చట్టాన్ని ఆమోదించి, అమలుకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు నిర్దేశించిన సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళే పన్నుకు సంబంధించిన రాష్ట్ర జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ), అంతర్రాష్ట్ర వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై విధించే సమగ్ర వస్తుసేవల పన్ను (ఐజీఎస్‌టీ)గా, జీఎస్‌టీ విధాన ప్రక్రియను వర్గీకరించారు. ఈ విధాన ప్రక్రియలో ఇప్పటివరకు 60 వేల రిజిస్ట్రేషన్లు నకిలీవిగా భావించి 43వేల రిజిస్ట్రేషన్ల ప్రాంతాలలో సోదాలు జరిపి 11,140 నకిలీవిగా తేల్చారు. ఇటీవల జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఖవిలువలో 28శాతం టాక్స్‌ విధింపునకు నిర్ణయం తీసుకుంది. హార్స్‌రేసింగ్‌, క్యాసినోలకు కూడా ఈ రేటు వర్తించనుంది. క్యాన్సర్‌ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు వినియోగించే కొన్ని మందులు, ప్రత్యేక వైద్యపరిస్థితులలో అవసరమయ్యే కొన్ని ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయిస్తూ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
మరోవైపు జీఎస్టీ వల్ల పెద్ద ఎత్తున నష్టపోయింది బడుగు, బలహీన వర్గాల ప్రజలు. జీఎస్టీ రూపకల్పనతో ధరలు తగ్గేందుకు వీలు కలిగి పేద రాష్ట్రాలు లాభపడతాయని, సులభమైన, సమ్మిళిత పన్నురేట్లతో ఏకరూపత, మెరుగైన పోటీతత్వం, సులభ నిర్వాహణా సౌలభ్యం, అధిక రాబడి సామర్థ్యం, మొత్తం పన్ను రాబడి నుంచి ఉపశమనం వంటి ప్రయోజనాలు చేకూరతాయని ఉద్దేశించిన లక్ష్యం సాకారం కాలేదు. వివిధ రకాల వస్తు సేవలను 1శాతం, 5, 12, 18, 28 శాతం జీఎస్‌టీ పన్ను శ్లాబుల పరిధిలోకి వచ్చేలా చూసింది. అయితే అది సామాన్యుడి ఆదాయమే ప్రాతిపదికగా పన్నుల పరిధి విస్తృతమవున్న నేపథ్యంలో పన్నుల వ్యవస్థ అసమానతలకు జీఎస్టీ ప్రక్రియ పరిష్కారం చూపలేదు. జీఎస్టీ అమలు ప్రారంభం నుంచి 50వ కౌన్సిల్‌ సమావేశం వరకు సుమారు 1500 నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొంటున్నప్పటికీ వీటిలో సామాన్యుడికి స్వాంతన చేకూర్చినవి అతి తక్కువ. కానీ ప్రభుత్వానికి ఉపయోగపడింది ఎక్కువే. ఈ ఆరేండ్ల జీఎస్‌టీ అమలు ప్రస్థానంలో, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పన్ను ఆదాయంలో సగానికి పైగా జీఎస్టీ ద్వారానే సమకూరింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.18.10లక్షల కోట్లు మేరకు జీఎస్టీ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థ పన్ను ఆదాయాన్ని ఆర్జించింది. అశేష ప్రజానీకం వినియోగించే అత్యవసర, నిత్యావసర వస్తుసేవలపై జీఎస్టీ భారాన్ని మినహాయిం చాలనే డిమాండ్స్‌ ఉన్నా వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదు. ధరల నియంత్రణ యంత్రాంగంపై మార్కెట్‌ శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర, అత్యవసర వస్తుసేవల శ్లాబురేట్లను హేతుబద్దీకరించి, ఉపశమనం కలిగించటం అత్యంత ఆవశ్యకం.
గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ నెట్‌వర్క్‌ను, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ పరిధిలోనికి తీసుకువస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిర్ణయంతో జీఎస్‌టీ నెట్‌వర్క్‌ కూడా ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)లతో సమాచారాన్ని పంచుకోవాల్సిన సంస్థల జాబితాలోకి చేరింది. దీని ప్రకారం ఎవరైనా జీఎస్టీ మదింపుదారులు అనుమానాస్పద విదేశీ కరెన్సీ లావాదేవీలు చేసినట్లయితే వారి వివరాలను సదరు సంస్థలు జీఎస్టీ నెట్‌వర్క్‌కు షేర్‌ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వివిధ నియంత్రణా సంస్థలు కూడా సమాచారాన్ని జీఎస్టీ నెట్‌వర్క్‌తో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపట్ల ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వివిధ రాష్ట్రాలు ఆందోళనను వెలిబుచ్చాయి. 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో సినిమా హాళ్ళలో అందించే తినుబండారాలపై, వండని, వేగించని తినుబండారాలపై, ఫిష్‌ సోలుబుల్‌ పేస్ట్‌పై, ఎల్‌డీ స్లాగ్‌పై జీఎస్టీని 18శాతం నుంచి 5కు, నూలుపై 12శాతం నుంచి ఐదుకు తగ్గించారు. ప్రయివేటు కంపెనీలు అందించే ఉపగ్రహ ప్రయోగసేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఎస్‌యువిల నిర్వచనంలో నాలుగు ప్రమాణాలుగా మార్పులను ప్రతిపాదిం చారు. పన్ను రిటర్న్స్‌ దాఖలులో గందరగోళ, అనిశ్చితి పరిస్థితులను సరిదిద్ది, జీఎస్టీ వ్యవస్థను సరళీకరించి పన్ను పరిధిని విస్తృత పరిచే దిశగా, వ్యవస్థాగత సంస్కరణలలో భాగంగా ఫిజికల్‌ వెరిఫికేషన్‌, బయోమెట్రిక్‌, జియోట్యాగింగ్‌, ఎలక్ట్రానిక్‌ వేబిల్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ డేటాను, కృత్రిమ మేథను వినియోగిం చటం, జీఎస్టీ ఆడిట్‌ వంటి విధానాలకు రూపకల్పన జరుగుతోంది. జీఎస్‌టీఆర్‌-9, జీఎస్‌టీఆర్‌-9సి వంటి అంశాలలో గత ఆర్థిక సంవత్సరంలో కల్పించిన రాయితీలను ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తామన్నారు.
సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, అదనపు ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, అదనపు కస్టమ్స్‌ డ్యూటీ, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను, అమ్మకపు పన్ను, వినోదపు పన్ను, విలాస పన్ను, ఆక్ట్రారు పన్ను, ప్రవేశ పన్ను, కొనుగోలు, ప్రకటనల పన్ను వంటి 17రకాల పెద్ద పన్నులను, 13రకాల సెస్‌లను విలీనం చేసి జీఎస్టీని అమలులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల రెవెన్యూ షేరింగ్‌ ఫార్ములాకు మార్పులు చేయాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్‌ కొనసాగుతోంది. జీఎస్టీ పాలనా కాలంలో అతికొద్ది రాష్ట్రాలు మాత్రమే వృద్ధిరేటును సాధించాయి. రాష్ట్రాల అధికారాలకు, హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోందనే భావన, రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా జీఎస్టీ పయనిస్తోందనే విమర్శలతోపాటు, ఆరు సంవత్స రాల గమనంలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ నినాదంతో రూపొందిన జీఎస్టీ విధానం, పెట్రోల్‌, డీజిల్‌ వంటి అధిక పన్ను భారాల వస్తూత్పత్తులను సమ్మిళితం చేసుకోకపోవడంపై వివాదం కొనసాగు తూనే ఉన్నది. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం, విద్యుత్‌, ఇన్సూరెన్స్‌ వంటి వివిధ కీలక రంగాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించటం, శ్లాబులను హేతుబద్దీకరించటం తక్షణ అవసరం.
సెల్‌: 9440905501
జి. కిషోర్‌కుమార్‌

Spread the love