భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి

People should be vigilant in view of heavy rains: Minister Komati Reddy– రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల అధికారులు అలర్ట్ గా ఉండాలి
– తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి 
– ప్రజలకు అందుబాటులో జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు
– ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచన
– రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రాంగం అప్రమత్తం 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచే వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షస్తున్న మంత్రి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పిన మంత్రి హైడ్రా తో గొలుసుకట్టు చెరువులను పునరుద్దరణ చేస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి హైదరాబాద్ కు వరద ముంపు ఉండదని అయన చెప్పారు. ఇక నల్గొండ జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు. జిల్లాల్లో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షాపాతం.. జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ తో సమాచారం తెప్పించుకుంటున్న మంత్రి.. కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు నిరంతరం సూచనలు చేస్తున్నారు.
వర్షం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరు విధులకు గైర్హజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో ఇళ్లలోకి నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించడంతో పాటు.. విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసకోవాలని, స్తంభాలకు విద్యుత్ సరఫరా జరగకుండా ఎలక్ట్రిటీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది వీధివీధిలో అలెర్ట్ గా ఉండి మ్యాన్ హోల్స్ అడ్డంకులను తొలగించి వర్షపునీరు వెళ్లేలా చూడాలని చెప్పారు. కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని.. ఎంతమంది ప్రజలు వచ్చినా ఇబ్బందులు రాకుండా ఉండేలా పునరావాసా కేంద్రాన్ని తక్షణం అందుబాటులోకి తేవాలని మంత్రి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా.. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టడంతోపాటు, అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ లను చేపట్టాలని తెలిపారు. అంతేకాదు, వైద్య బృందాలను అప్రమత్తం చేయాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్పా ఇళ్లు విడిచి బయటకు రారాదని.. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు.  ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ట్రాన్స్ కో,  ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులంతా అందుబాటులో ఉంటూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేసే విధంగా  సిబ్బంది 3 షిఫ్టులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. నల్గొండ ప్రజలకు ఏదైన తక్షణ సహాయం అవసరంఉంటే.. 1800 4251 442 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణహాని, ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.
Spread the love