నవతెలంగాణ – హైదరాబాద్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఒకే సీటు గెలుస్తుందని మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. కానీ తామేదో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకొని నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చేయించారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు మన మేనిఫెస్టోనే కాపీ కొట్టారని విమర్శించారు. చివరకు కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాటలనే కాపీ చేస్తోందన్నారు.