తోషఖానా అవినీతి కేసులో …

– 30న నవాజ్‌ షరీఫ్‌ స్టేట్‌మెంట్‌ నమోదు
ఇస్లామాబాద్‌ : తోషఖానా అవినీతి కేసులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ స్టేట్‌మెంట్‌ను ఈ నెల 30న నమోదు చేయాల్సిందిగా ఇస్లామాబాద్‌లోని అకౌంటబిలిటీ కోర్టు, అవినీతి నిరోధక సంస్థను ఆదేశించింది. నాలుగేళ్ల పాటు లండన్‌లో ప్రవాసంలో వున్న షరీఫ్‌ అక్టోబరు 21న పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. తోషఖానా అవినీతి కేసులో సోమవారం అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ బషీర్‌ విచారణ జరిపారని, షరీఫ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సిందిగా ఆదేశించారని డాన్‌ వార్తా పత్రిక పేర్కొంది. ఈ కేసులో రికార్డింగ్‌ కోసం నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి)కు ఆదేశాలు జారీ చేయాలని షరీఫ్‌ తరపు న్యాయవాది ఖ్వాజి మిస్బా కోర్టును కోరారు. నవాజ్‌ లేనపుడు రిఫరెన్స్‌ దాఖలైంది. దానిపై అనుబంధ రిఫరెన్స్‌ కూడా దాఖలు చేయాల్సి వుందని ఆయన చెప్పారు. దానిపై కొంత గడువు కావాల్సిందిగా ఎన్‌ఎబి ప్రాసిక్యూటర్‌ కోరారు. దాంతో 30వ తేదీన నమోదు చేయాల్సిందిగా ఆదేశిస్తూ అప్పటివరకు విచారణను వాయిదా వేశారు.

Spread the love