– ప్రభుత్వ సలహాదారు రమణ
నవతెలంగాణ-కల్చరల్
నాడు సమాజంలో ఉన్న వివక్ష, వ్యతిరేక పరిస్థితులు నుంచి ఇనాక్ శిఖరంలా ఎదిగారని ప్రభుత్వ సలహదారు డాక్టర్ రమణ ప్రశంసించారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చొనక, స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొనే వారు ఇనాక్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గానసభ నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన వ్యాస పరిణామం పరిశోధనా గ్రంథాన్ని డాక్టర్ రమణ ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగులో వెలువడిన వ్యాసాల్లో పరిశోధన అంశం గ్రహించటం ఇనాక్‌లో ఉన్న సృజనాత్మకతకు నిదర్శనం అన్నారు. సాహితీవేత్త ఆచార్య గౌరీశంకర్ మాట్లాడుతూ.. మట్టి పొరల్లో నుంచి మొలకగా వెలువడి మొక్కగా.. వటవృక్షంగా ఎదిగిన ఇనాక్ తాను రాసిన ప్రతి అక్షరం కన్నీటి చుక్క అని చెప్పారని తెలిపారు. వ్యవహారిక భాషలో పరిశోధన చేయటం సమగ్ర విషయ సేకరణ వ్యాస పరిణామ గ్రంథంలో ద్యోతకమవుతుందని వివరించారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ.. సామాన్యుల కోసం సాహితీ కృషి చేసిన ఇనాక్ 85వ జన్మదినం సాహిత్య సప్తాహంగా జరపడం గానసభ సముచితమని భావించామన్నారు. పద్మావతి విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి కొలకలూరి మధు జ్యోతి, ఆచార్య కొలకలూరి సుమన్ పాల్గొన్నారు. మల్లాది ఉష శిష్య బృందం గాన గోష్టి ఆకట్టుకుంది.
తెలంగాణ సాహితీ సన్మానం…
పద్మశ్రీ కొలకనూరి ఇనాక్ 85వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, సంయుక్త కార్యదర్శి ఎస్‌కే సలీమా, కోశాధికారి మోహనకృష్ణ, కవి, రచయిత రామకృష్ణ చంద్రమౌళి తదితరులు పాల్గొని అభినందించారు. ఇనాక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సాహితీ సప్తాహం పేరుతో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఏడు రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతీరోజూ ఆయన స్వీయ రచనలైన వ్యాస పరిణామం (పరిశోధన), వలస (నవల), దిక్కులేనోడు (నాటిక), విశాల శూన్యం (కవిత్వం), విమర్శిని (విమర్శ), పొలి (కథానిక) ఆల్మ్స్ ఆఫ్ ప్యారడాన్ (అనువాదం) గ్రంథావిష్కరణలు ఉంటాయి.