ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన సభ కరపత్రన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ బోలేశ్వర్ మాట్లాడుతూ.. నవంబర్ 3 న జరగబోయే మహాసమ్మేళన సభకి రావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, డి ఎఫ్ సి ప్రజలకు, కార్యకర్తలు తరలి రావాలని మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. 2023 మార్చ్ 15 న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ పీడిత ప్రజానీకం కోసం, వారి ఆత్మగౌరవం, అధికారం కోసం, అగ్రవర్ణ భూస్వామ్య రాజకీయ వ్యవస్థ పై యుద్ధం చేయడానికి, ధర్మ సమాజ్ పార్టీ (డి.ఎస్.పి) ని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ శ్రామిక ప్రజల శ్వేదంతో, రక్తంతో తడిచిన ఈ నేల ఈ తెలంగాణ భూమి. ఇది “మన భూమి” కానీ ఈ భూమిపై మనకే విలువ లేదు, గౌరవం లేదు, కడజాతి ప్రజలుగా చూడబడుతున్నం. మనకు ఇక్కడ రాజకీయ వాటా లేదు, అధికారం అంతకన్నా లేదు, మనకు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు మరి ఇలాంటి దారిద్రపు జీవితం జీవిస్తున్న మన ప్రజలకు. ఇన్నాళ్లకు ఒక రాజకీయ వేదిక ఏర్పడింది. ఇది మామూలు విషయం కాదు. ఈ రాజకీయ ఆయుధం తో మన ప్రజల్ని దుఃఖం నుండి విముక్తి చేయవచ్చు. వేల సంవత్సరాల క్రితం మన ప్రజల్ని ఏ విధంగా వాడుకొని పీడించారో మళ్లీ ఇప్పుడు భారత రాజ్యాంగం వచ్చాక కూడా అంతే దోపిడీ కొనసాగిస్తున్నారు. ఈ అగ్రవర్ణ పాలకవర్గాలు. అందుకే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలపై నిరంతరం పోరాడాల్సిందే అన్నారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ పేదల రాజ్యాన్ని నిర్మించాల్సిందే,దానికై… పార్టీ నిర్మాణం-సమీక్ష-భవిష్య కార్యాచరణ కొరకు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం నిర్వహిస్తున్నాం. డి.ఎస్.పి సైనికులైన కార్యకర్తలమంతా విధిగా పాల్గొందాం అన్నారు. ఈ మహా సమ్మేళనం నుండి మహా సమరం లోకి దిగుదాం అని పేర్కొన్నారు. మన ప్రజల్ని రక్షించుకుందాం.మన ధర్మ సమాజ్ పార్టీని గెలిపించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు లక్ష్మణ్, జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, గంగరాజు, రాజశేఖర్, కవిన్,లక్ష్మణ్,శివరామకృష్ణ, నితిన్, లింగం, సత్యం తదితరులు పాల్గొన్నారు.