బొగ్గు ఉత్పత్తి పెంచండి

Increase coal production– జీఎమ్‌లకు సీఎమ్‌డీ బలరాం ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాలు తగ్గుముఖం పట్టినందున సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరాం అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారంనాడాయన సంస్థ జనరల్‌ మేనేజర్లతో హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సింగరేణిలో రోజుకు 2 లక్షల 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలనీ, దానికోసం ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పారు. అలాగే రోజుకు కనీసం 16 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు కూడా జరగాలని ఆదేశించారు. ప్రతి గనికి రోజువారి లక్ష్యాలు నిర్దేశించుకోవాలనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఐదు నెలల కాలంలో గైర్హాజరును పూర్తిగా తగ్గించి, మానవ వనరులు, యంత్ర వినియోగాన్ని పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంస్థలోకి త్వరలో ఇటీవల ఎంపికైన మైనింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇచ్చి, నవంబర్‌ రెండోవారంలో ఏరియాలకు కేటాయిస్తామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు సాధించామనీ, ప్రస్తుతం 130 ఎకరాల అటవీ భూమిలో ఉన్న చెట్ల లెక్కింపును అటవీ శాఖ వారు ప్రారంభించారని చెప్పారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యి, 2025 జనవరి నుంచి ఇక్కడ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కొత్తగూడెం వీకే ఓపెన్‌ కాస్ట్‌, ఇల్లందు రొంపేడు ఓపెన్‌ కాస్ట్‌, రామగుండం కోల్‌ మైన్‌, గోలేటి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఆయన అక్కడి అధికారులతో చర్చించారు. పెండింగ్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్‌ ఎమ్‌, ఆపరేషన్స్‌), డైరెక్టర్‌ జీ వెంకటేశ్వర్‌ రెడ్డి (పీపీ అండ్‌ పర్సనల్‌), జనరల్‌ మేనేజర్‌ (కోఆర్డినేషన్‌) ఎస్‌డీఎమ్‌ సుభాని, జీఎం (మార్కెటింగ్‌) రవి ప్రసాద్‌, జీఎం (సిపిపి) మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love