– తగ్గిన పామ్ అయిల్ సరఫరా
న్యూఢిల్లీ : భారత్‌కు పామాయిల్ దిగుమతులు పడిపోవడంతో.. సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయా వంట నూనెల దిగుమతులు పెరిగాయి. సన్‌ఫ్లవర్ వంట నూనె దిగుమతులు ఫిబ్రవరితో పోల్చితే గడిచిన మార్చిలో 51 శాతం పెరిగాయని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంత గరిష్ట స్థాయిలో పెరగడం రెండవ సారి. ప్రత్యర్థి పామాయిల్ కొనుగోలును తగ్గించడంతో పాటు తక్కువ ధరలో ఇతర వంట నూనెల కొనుగోళ్లను పెంచడానికి దారి తీసిందని.. మలేషియాను ఉద్దేశించి ఐదుగురు డీలర్లు పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెల దిగుమతిదారుగా ఉన్న భారత్ పామాయిల్ కొనుగోళ్లను తగ్గించడంతో అత్యధికంగా ట్రేడ్ అవుతున్న మలేషియా పామాయిల్ ఫ్యూచర్స్‌లో ర్యాలీని పరిమితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. డీలర్ల అంచనాల ప్రకారం.. గడిచిన మార్చిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు నెలవారీగా 51 శాతం పెరిగి 4,48,000 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. పామాయిల్ దిగుమతులు 3.3 శాతం తగ్గి 4,81,000 టన్నులకు పరిమితమయ్యాయి. ఇది మే 2023 నాటి అతి కనిష్ట స్థాయి.
”పామాయిల్ స్థానంలో పొద్దు తిరుగుడు నూనె దిగుమతులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఉత్పత్తి సమస్యలు పామాయిల్ ధరలను దృడంగా ఉంచుతున్నాయి. కొనుగోలుదారులు సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు మారేలా చేస్తున్నాయి”. అని వెజిటేబుల్ ఆయిల్ బ్రోకరేజీ సంస్థ సన్‌విన్ గ్రూప్ సిఇఒ సందీప్ బజోరియా పేర్కొన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు చాలా పోటీగా ఉన్నాయని, ఏప్రిల్, మే నెలల్లో కూడా అధిక దిగుమతులు ఉండొచ్చని ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్, బ్రోకర్ జిజిఎ రీసెర్చ్ మేనేజింగ్ భాగస్వామి రాజేష్ పటేల్ తెలిపారు. భారత్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుండి పామాయిల్ కొనుగోలు చేస్తుంది. మరోవైపు అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుండి సోయా, పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటుంది.