– గోదావరితో అధికారులకు ‘ముంపు’ తిప్పలు
– పోలవరం వల్లే ఈ ముంపు
– వరదకు ‘భద్రాచలం’ బలికాకతప్పదా..?
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
తగ్గుతూ.. పెరుగుతూ.. భద్రాచలం వద్ద గోదావరి అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి తగ్గిన గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి పెరగటం ప్రారంభించి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను, అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వర్షాలు కొంతమేరకు తగ్గినా, ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గకపోవడంతో భారీగా వరద నీరు గోదావరికి చేరుతోంది. దాంతో భద్రాచలం వద్ద గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరగటం ప్రారంభించింది. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి శబరి నది శాంతించి ఎదురుపోటు లేకపోవడంతో వరద ఉధృతి తీవ్రత కొంతమేర భద్రాచలం వద్ద తగ్గింది. శుక్రవారం రాత్రికి మరోసారి 48 అడుగులకు చేరుకొని రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా పేరూరు వద్ద గోదారి వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం అధికారుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతూ.. తగ్గుతూ.. దోబూచులాడుతున్న గోదావరి ప్రభావంతో జాతీయ రహదారుల వద్ద రాకపోకలు కొనసాగటం, కొంత సమయానికే మళ్లీ నిలిచిపోవడంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు భద్రాచలం పట్టణంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. పట్టణంలోని ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, పరిసర ప్రాంతాల్లో స్లూయిజ్‌ల నుంచి లీకైన వరద నీరు వెనక్కి పోకపోవడంతో ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటపాక వద్ద ఉన్న స్లూయిజ్ లాకులు ఎత్తితే తప్ప, వరద నీరు వెనక్కి పోని పరిస్థితి ఉంది. 46 అడుగులకు గోదావరి తగ్గితేనే లాకులు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో ఎన్ని రోజులు వరద నీటిలో ఉండాల్సి వస్తుందో తెలియక లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు పోలవరం ముంపు మండలాల్లో సైతం అదే పరిస్థితి నెలకొంది.
పోలవరం పాపమే ఈ ముంపు
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే భద్రాచలం నియోజకవర్గంతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి కాక తప్పదని 2006లోనే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యమాలు చేశారు. అప్పటి పాలకులు గాని, ఇతర రాజకీయ పార్టీలకు గాని ఆ సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో భద్రాచలంతో పాటు విలీన మండలాలలోనే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంటే పోలవరం ప్రభావం ఈ ప్రాంతంపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలవరం ప్రాజెక్టు వద్ద కేవలం కాపర్ డ్యామ్ పూర్తయితేనే విలీనం మండలాలతో పాటు భద్రాచలం పట్టణానికి 45 నుంచి 50 అడుగులకు వరద వస్తుంది. అయితే ప్రాజెక్టు పూర్తయితే 50 నుంచి 60 అడుగుల వరకు గోదారి నీటిమట్టం వస్తే ఈ ప్రాంతాల పరిస్థితి ఏంటిని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు మేల్కొని పోలవరం ముంపుపై నిర్దిష్టమైన కార్యచరణ చేపట్టకపోతే భవిష్యత్తులో భద్రాచలంతో పాటు విలీనం మండలాలు గోదారమ్మకు బలికాక తప్పదని స్పష్టమవుతుంది. కాగా, సరిహద్దులోని ముంపునకి గురైన ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు తక్షణ సహాయంగా రూ.3వేలు ప్రకటించారు. ప్రధానంగా కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.