పెరుగుతున్న నిరుద్యోగం

అంతా మోడీ వైఫల్యం
– ప్రకటనలకే పరిమితమైన ఎన్నికల హామీలు

–  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యం
–  నైపుణ్య కొరతతోనూ నిరుద్యోగులుగా మారుతున్న వైనం
– భావితరాన్ని పూర్తిగా విస్మరించిన కేంద్రం
భారత జనాభాలో దాదాపు 54 శాతం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. దేశ భవిష్యత్తులో యువత పాత్ర చాలా కీలకం. అయితే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఆ యువతను విస్మరిస్తున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు హామీనిచ్చి 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ హామీని గాలికొదిలేసింది. దీంతో దేశంలోని యువత మునుపెన్నడూ ఎరగనంత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది.

న్యూఢిల్లీ : నిరుద్యోగం విషయంలో అడుగడుగునా మోడీ సర్కారు వైఫల్యం కనిపిస్తున్నది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంబంధం లేకుండా వాదిస్తున్నది. దేశ జనాభా పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ఎర్రకోట నుంచి ప్రధాని చెప్పారు. ముస్లిం మైనారిటీల అధిక జననాల రేటు ప్రమాదకరమనీ, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. పరోక్షంగా ఒక వర్గాన్ని నిందించటమే ఈ వ్యాఖ్యల సారాంశమన్నది బహిరంగ రహస్యమే. దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది పోయి.. దేశ జనాభాను నిరుద్యోగానికి సమస్యగా చూపెడుతూ మోడీ సర్కారు తన తప్పును కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నదని మేధావులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి కేంద్రం నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన విషయంలో ఏమాత్రమూ సీరియస్‌గా వ్యవహరించలేదు.. ”స్కిల్‌ ఇండియా” నినాదం.. ఒక నినాదంగానే ఉన్నది తప్పితే దేశ యువతకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. దేశ జనాభాలో 62 శాతం కంటే ఎక్కువ మంది 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గలవారున్నారు. ఇందులో పని చేసే వయ స్సున్నవారు దాదాపు 54 శాతం మంది 25 ఏళ్ల లోపు వారే. రాబోయే దశాబ్దంలో 15-59 సంవత్సరాల వయస్సున్నవారి జనాభా పెరుగుతుందని ఒక అంచనా. అయితే, దేశంలోని ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి, నైపుణ్యాల కల్పన విషయంలో మోడీ సర్కారు విఫలమైందనీ, ఈ విషయంలో పొరుగు దేశం చైనా చక్కటి ప్రదర్శననున కనబరుస్తున్నదని నిపుణులు విశ్లేషించారు. శ్రామిక శక్తిలో నైపుణ్యం లేకుంటే అంచనాలలో పేర్కొన్నవిధంగా దేశ శ్రామిక శక్తిలో 32 శాతం పెరుగుదల ఏమీ ఉండదని తెలిపారు. పైగా తగిన పని దొరకక వారు నిరుద్యోగులుగా మారుతారని హెచ్చరించారు.
శ్రామికశక్తి ఉన్నా …
గత దశాబ్ద కాలంగా పని ప్రపంచం వేగంగా మారుతోంది. కోవిడ్‌-19 మహమ్మారి మార్పుల వేగాన్ని మరింత వేగవంతం చేసింది. వేగంగా మారుతున్న ఈ పని ప్రపంచం పూర్తిగా భిన్నమైన నైపుణ్యాలను కోరుతున్నది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్‌ భారీ జనాభా ప్రయోజనాన్ని అనుభవిస్తున్నప్పటికీ, దేశ శ్రామిక శక్తి నైపుణ్యాలు, శిక్షణలో నిరాశాజనకంగా వెనుకబడి ఉన్నది. మన శ్రామిక శక్తిలో కేవలం 5 శాతంమంది మాత్రమే ఏదైనా అధికారిక నైపుణ్య శిక్షణ పొందారు. ఇది యూకేలో 68 శాతం, జర్మనీలో 75 శాతం, యూఎస్‌లో 52 శాతం, జపాన్‌లో 80 శాతం, దక్షిణ కొరియాలో 96 శాతంగా ఉండటం గమనార్హం.
ఇక ప్రభుత్వ స్వంత అంచనాలను పరిశీలిస్తే.. 2022 నాటికి, మౌలికరంగంలో దాదాపు 1.5 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంటుంది. ఆటో కాంపోనెంట్స్‌ విభాగంలో 3.5 కోట్ల మంది, భవనం మరియు నిర్మాణంలో 3.3 కోట్ల మంది, దుస్తులు మరియు వస్త్రాలలో రంగంలో 2.6 కోట్ల మంది కొరత ఉంటుంది. అలాగే, రవాణా మరియు లాజిస్టిక్స్‌లో దాదాపు 1.8 కోట్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంటుంది. వ్యవస్థీకత రిటైల్‌లో మరో 1.7 కోట్లుగా ఉండనున్నది. రియల్‌ ఎస్టేట్‌ సేవల్లో దాదాపు 1.4 కోట్ల మంది, ఆరోగ్య సంరక్షణలో సుమారు 1.3 కోట్ల మంది, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఒక కోటి మంది, విద్యలో 60 లక్షల మంది కొరత ఉంటుంది. ఇది దేశంలో నైపుణ్యం లేని కార్మికుల కొరత తీవ్రతకు అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా వారంతా నిరుద్యోగులుగానే మిగిలే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. అయితే, దేశ యువతకు, శ్రామికులకు నైపుణ్యాభివృద్ధి విషయంలో మోడీ సర్కారు మాటలు నీటి మీద రాతలుగానే మారాయన్నారు.
ఉపాధిలేక…
ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ 2021 దేశంలో ఉన్న తిరోగమన పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఈ సమాచారం ప్రకారం అధికారికంగా చదువుకున్నవారిలో ఉద్యోగావకాశాలు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. బీటెక్‌లో 47 శాతం, ఎంబీఏలో 47శాతం, బీఏలో 43 శాతం, బీకామ్‌లో 40 శాతం, బీఎస్సీ గ్రాడ్యుయేట్లలో 30 శాతం మంది మాత్రమే ఉపాధి నైపుణ్యాలను కలిగి ఉన్నారు. డిగ్రీ హౌల్డర్లలో 22 శాతం మంది మాత్రమే ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఐటీఐ గ్రాడ్యుయేట్లలో 75 శాతం మందికి ఉపాధి నైపుణ్యాలు లేకపోవటం గమనార్హం. ఫార్మా గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 67 శాతంగా ఉన్నది. ఇతర రంగాలను కూడా కలుపుకుంటే, ప్రతి సంవత్సరం లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే 1.5 కోట్ల మంది యువకులలో 65 శాతం నుంచి 75 శాతం వరకు నిరుద్యోగులే కావటం గమనార్హం. దేశంలో జూలై 2021 చివరి నాటికి నిరుద్యోగం రేటు 6.95 శాతానికి పెరిగింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 8.3 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 6.4 శాతంగా ఉన్నది. ఇక కోర్‌ సెక్టార్లలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. తయారీ, మైనింగ్‌లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అయితే, దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపెట్టటం, అందుకు అవసరమైన నైపుణ్యాలను కల్పించటం వంటివి చేయాల్సిన మోడీ సర్కారు.. ఈ విషయంలోనూ జనాభా పెరుగుదలను సాకుగా చూపి, ఒక వర్గం వారిని అందుకు కారణంగా చూపుతూ.. వారిపై విద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేయటం దేశ భవిష్యత్తుకు ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని మేధావులు, సామాజికవేత్తలు తెలిపారు.

Spread the love