నిరవధిక వాయిదా

సభా భవనం. జనం కిటకిట తలుపులు కిటారు తలుపులు తెర్చుకుని వేదిక వైపు చూస్తున్నారు. అంగ వంగ కళింగ కాశ్మీర రాజులు ఉచిత బంగారు ఆసనాల మీద కిరీటాలు మోస్తూ కూచుని వున్నారు. ఆకాశం నుంచి ప్రచండ భానుడు కిటికీల సందుల్నుంచి ఆ సందడిని తొంగి చూస్తున్నాడు. అది అవంతీ రాజ పట్టాభిషేక మహోత్సవ సందర్భం.
పట్టాభిషేకాన్ని చూడ్డానికి ఎప్పుడు తీసిన చప్పుడు కాని కనురెప్పలు వాల్చకుండా చూస్తున్న వాళ్లల్లో రాజులతో పాటు వారి పరివారం, వారి గుర్రాలకు గుగ్గిళ్ళు పెట్టేవాళ్లు, ఏనుగుల చేత వెలగపండ్లు మింగించే వాళ్లు, రాజులకు ప్రత్యేకంగా వండివార్చి వడ్డించేవారు అనేకమంది వున్నారు. వంకర చూపుల మంత్రులూ, మీసాలు తిప్పే సేనాధిపతులు, గడ్డాలు సవరించే సీనియర్‌ సిటిజన్లూ వున్నారు.
నల్లవెంట్రుకలు తెల్లబడి, ఆపైన ఒకటొకటిగా రాలిపడి బట్టతల వచ్చినా, నోట్లో లెక్కపెట్టడానికి మాత్రమే మిగిలిన దంతాలు వున్నా, నరాలు ముడతలు పడి కాళ్లూ, చేతులూ అదుపు తప్పినా పాత రాజావారికి పరిపాలన మీద ప్రేమ తగ్గలేదు. సింహాసనం మీద కూర్చోవాలన్న యావ చావలేదు నిన్నమొన్నటి దాకా అవంతిని బంతిలా ఆడుకున్న ముసలిరాజు మంచానికి అతుక్కుపోవడంతో యువరాజా వారికి ఈ ‘భలేచాన్సు’ లభించింది.
సుముహుర్తం సమీపించింది. గ్రహాలు ఏ యే గృహాల్లో వుండాలో అక్కడికి వెళ్లి సెటిల్‌ అయ్యాక, రాజపురోహితుడు, రాజకుమారుని వెంట పెట్టుకుని, పెద్ద పళ్లెంలో కిరీటాన్ని మోస్తూ సింహాసనం దగ్గరికి వచ్చాడు. జనం ‘జై జై’ అని అరుపులు అందుకున్నారు. రాజకుమారుడు సింహాసనం మీద కూచోవడం, పురోహితుడు ఆ తల మీద రాజ్యభారాన్ని కిరీటంగా పెట్టడం అంతే!
ఎక్కడ్నుంచి వచ్చాడో ఓ సన్యాసి. ఒంటినిండా బూడిద, తలనిండా జడలు కట్టిన జుట్టు, నుదుటి నడుమ పెద్ద బొట్టు ఉన్నవాడు వస్తూనే, ఆగండి! ఆగండి! కిరీటం పెద్దవద్దు అంటూ వేదిక ఎక్కాడు. అక్కడ ప్రాణం వున్న జీవులంతా నిశ్ఛేష్టులయ్యారు. ఊపిరి పీలవడం, కనురెప్పలు మూయడం మరిచిపోయారు.
ఎవరు? తమరెవరు? ఎందుకు ఈ పట్టాభిషేకానికి అడ్డు పడుతున్నారు అన్నారు వేదిక మీద వున్న రాజ వంశీకులు, ప్రముఖులు, సంపన్నులు. నేనెవరినో మంచం పట్టిన పెద్ద రాజావారికి తెల్సు. మీ కుల గురువును యువరాజా! మీ తాత ముత్తాతల కాలం నుంచి మా తాత ముత్తాతలు ప్రతి పట్టాభిషేకానికీ రావడం ఆనవాయితీ. మేం రాకుండా, మేం లేకుండా తమరు కిరీటం ధరించడం మహాపచారమే అవుతుంది అన్నాడు ఒంటిమీది నుంచి బూడిద రాలుతున్న బూడిద సన్యాసి. అయితే తమరే స్వయంగా ఈ ఉత్సవాన్ని జరిపించండి. అంటూ పక్కకు తప్పుకున్నాడు పురోహితుడు. ఇదే నా తక్షణ కర్తవ్యం అంటూ కిరీటం అందుకున్న సన్యాసి హేరాజన్‌! ఇక రాజ్యం నీదే, రాచరికం నీదే, విచ్చలవిడిగా అధికారం చాలాయించు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పరిపాలించు. పాలించడం అంటే దండించడమే. దండించడం లేకుండా శాంతిభద్రతలు భద్రంగా ఉండజాలవు. కనుక ప్రజల్ని నీ మార్గంలో పెట్టు. అందుకు రాజదండాన్ని పట్టు. ఏదీ రాజదండం అని అరిచాడు.
వేదిక మీదా, ముందూ వున్నవాళ్లు ముఖాలు చూసుకున్నారు. రాజోద్యోగులు మూగ సైగలు చేసుకున్నారు. ఎవరూ మాట్లాడ్లేదు. శబ్దం పెదవికి వేలు అడ్డం పెట్టుకుంది. రాజదండం ఏది? ఎక్కడీ రాజదండం లేకుండా పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు అని చిందులు తొక్కిన సన్యాసి పట్టాభిషేకం తాత్కాలికంగా వాయిదా వేయడమైనదని ప్రకటించాడు.
అవున్నిజమే. తరతరాలుగా వస్తున్న ఆచారం. రాజు సింహాసనం పక్కనే రాజదండం స్థాపించాలి అన్నారు వయోవృద్దులు. చూడవచ్చిన జనం రాజదండం లేదంట, పట్టాభిషేకం వాయిదా పడిందంట అని చెవులు కొరికేసుకున్నారు. సరిగ్గా సింహాసనం ఎక్కేప్పుడు ఈ తలనొప్పి వచ్చిపడిందని రాకుమారుడు తల పట్టుకున్నాడు. ముసలిరాజు తనకు అదెక్కడుందో గ్నాపకం రావడం లేదు అన్నాడు. రాజదండం కోసం వెదుకులాట మొదలైంది.
మూడు నెల్ల తర్వాత మళ్లీ పట్టాభిషేకం ఏర్పాటయింది. ఈసారి రాజకుమారుడి చేతిలో రాజడందం వుంది. అది ఎక్కడ ఎలా దొరికిందో ఎవరికీ తెలియదు. మొత్తానికి రాకుమారుడు ‘దాన్ని’ సాధించాడు. ఈసారి పట్టాభిషేకం గ్యారంటీ అని భావించాడు. బూడిద సన్యాసి వచ్చాడు. ఎగుడూ దిగుడూ కళ్లతో రాజదండాన్ని పరిశీలించి తల ఊపాడు. సింహాసనం పక్కనే రాజ దండాన్ని స్థాపించే కార్యక్రమం ఆరంభమైంది. ఇంతలో ఎక్కడ్నించి వచ్చాడో ఓ అగంతుకుడు ‘ఆగండి! ఆగండి!’ అని పెద్దగా కేకలు పెడ్తూ వేదిక ఎక్కాడు. సన్యాసికి పిచ్చికోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు? అన్నాడు. నేనెవరైతేనేం కాని మీ దగ్గర వున్నది అసలు రాజదండం కానేకాదు. రాజకుమారుడు రసహ్యంగా తయారు చేయించినది, నకిలీది. అసలు రాజదండం ఇదిగో అంటూ గుడ్డలో మూట కట్టుకు వచ్చిన మరో రాజదండాన్ని బయటకు తీశాడు. రెండు రాజదండాలు ఒకే తీరున వున్నాయి. అసలుదేది? కానిదేది తేల్చేది ఎలాగో ఎవరికీ అర్ధం కాలేదు. ప్రముఖుల ముఖాల్లో నెత్తుటి చుక్కలేదు. రాజోద్యోగుల గుండెల్లో ధూమశకటాలు పరుగెత్తేయి. సన్యాసి కనుబొమ్మలు ముడేసి ‘నిజ రాజదండ నిర్ధారణ’ కమిటీ వేయండి. అసలు రాజదండం ఏదో తేలేవరకు పట్టాభిషేకాన్ని నిరవధికంగా వాయిదా వేయండి అంటూ వచ్చిన దారినే ఒంటిమీది బూడిద రాలుస్తూ వెళ్లిపోయాడు.
పాత ఆచారాలకు, సంప్రదాయాలకు మంట పెట్ట అని శాపనార్ధాలు పెట్టారు కొందరు. రాజ్యానికి ప్రజాక్షేమం కోరే రాజు కావాలి కాని, దండించే రాజదండం అవసరమా? అనుకున్నారు ప్రజలు.
– చింతపట్ల సుదర్శన్‌, 9299809212

Spread the love