ఎన్డీయే ఆకస్మిక వ్యూహాలను తిప్పికొట్టాలి : ఇండియా కూటమి

ముంబాయిలో ఇండియా కూటమి భేటీ
ముంబాయిలో ఇండియా కూటమి భేటీ

నవతెలంగాణ హైదరాబాద్: ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశం ముంబయిలో జరుగుతోంది. ముంబయిలో గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దించడమే లక్ష్యంగా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.  సమావేశం ప్రారంభం కాగానే చంద్రయాన్‌-3 విజయంపై భారత అంతరిక్ష సంస్థ ఇస్రోను అభినందిస్తూ విపక్ష కూటమి ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే రేపు సూర్యుడిపైకి పంపనున్న ‘ఆదిత్య ఎల్‌-1’కు విజయవంతం కావాలని కాంక్షించింది. రెండురోజుల భేటీలో భాగంగా నిన్ననే ముంబయి చేరుకున్న నేతలకు ముంబయిలో శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే విందు ఇచ్చారు. ఈ క్రమంలో నేతల మధ్య ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తావనకొచ్చింది. ఎన్డీయే ఆకస్మిక వ్యూహాలను తిప్పికొట్టేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉండాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నేతలను అప్రమత్తం చేశారు. ఈ భేటీ అనంతరం 11 మందితో కూడిన సమన్వయ కమిటీ, లోగోను ప్రకటించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోగో విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పలు పార్టీలు సూచించిన మార్పులు అమలు చేసి, కొత్త లోగోను తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

Spread the love