జట్టుగా ఇండియా బ్లాక్‌

India block as a team– ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి ఐక్యతారాగం
– అమేథీ.. రారుబరేలీలో విజయం కోసం కృషి
లక్నో : రాజకీయాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి ఐక్యతారాగాన్ని ఆలపిస్తోంది. సీట్ల సర్దుబాట్ల తర్వాత యూపీలో అఖిలేశ్‌, రాహుల్‌ హవా నడుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి విఫలమైన విషయాన్ని రెండు పార్టీలు గుర్తించాయి. ఇపుడు కలిసి పోటీకి దిగటంతో..ఆ రెండు పార్టీల్లోనూ విజయం సాధించగలమన్న ధీమా కనిపిస్తోంది. అమేథీ, రారుబరేలీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇరు పార్టీల కార్యకర్తలు మైదానంలో ఒక జట్టుగా పని చేస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అమేథీ , రారుబరేలీలలో బ్యాక్‌-టు-బ్యాక్‌ కార్నర్‌ సమావేశాలు, ర్యాలీలతో దూసుకెళ్తున్నారు. ఆమె బహిరంగ కార్యక్ర మాలలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రెడ్‌ క్యాప్‌ క్యాడర్‌లో జోష్‌ కనిపిస్తోంది. 2017 పొత్తుల హడావుడి అట్టడుగు స్థాయికి చేరుకోలేక పోయిందని, పొత్తు కాగితాలపైనే మిగిలిపోయిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఇక్కడి ఎస్పీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు.
మా అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పొత్తును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌కు ఇచ్చిన 17 స్థానాల్లోని ఆఫీస్‌ బేరర్లు, ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ‘మీ పార్టీలా ఎన్నికల్లో పోరాడండి’ అని చెప్పారని బరేలీ జిల్లా చీఫ్‌ వీరేంద్ర యాదవ్‌ తెలిపారు. ఎస్పీ కార్యకర్తలందరూ ఆయన ఆదేశాలను పాటిస్తున్నారు అని వివరించారు. గతంలో అమేథీ, రారుబరేలీలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు అనుకూలంగా మౌఖిక అవగాహన కుదిరిందని, అయితే ఈసారి ‘ప్రకటిత కూటమి’తో భారత్‌ బ్లాక్‌ అభ్యర్థులను నిలబెట్టేందుకు కార్యకర్తలు మరింత ఉత్సాహంగా, కట్టుబడి ఉన్నారని వీరేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. రారుబరేలీలో రాహుల్‌ గాంధీ, అమేథీలో కిషోరీ లాల్‌ శర్మను విజయం వైపు నడిపించటానికి సర్వశక్తులు ఒడ్డినట్టు చెప్పారు. బీజేపీ పట్ల ప్రజలు విసిగిపోయారని, రారుబరేలీలో రాహుల్‌ గాంధీ రికార్డు మెజార్టీతో గెలుస్తారని, అమేథీలో శర్మ మంచి మెజార్టీతో గెలుస్తారని ఎస్పీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారని ఎస్పీ జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఇక్కడి ఎస్పీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ పార్టీ వాగ్దానాలు, హామీ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో మీడియా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకుడు అన్షు అవస్తీ మాట్లాడుతూ రారుబరేలీ, అమేథీలలో ఎస్పీ కార్యకర్తలు గాంధీ కుటుంబంతో సన్నిహితంగా, కుటుంబ పరంగా, చాలా భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నందున వారికి ఉత్సాహంగా మద్దతు ఇవ్వడం వెనుక కారణం స్పష్టంగా ఉందని అన్నారు.
రారుబరేలీలో ఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామ్‌ నరేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎస్పీ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తల మాదిరిగానే ఉత్సాహంగా ఉన్నారని, రారుబరేలీ, అమేథీలలో భారత కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించేలా కృషి చేస్తున్నారని అన్నారు. రారుబరేలీ నియోజకవర్గం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్‌ లను కలిగి ఉంది. బచ్రావాన్‌ హర్‌చంద్‌పూర్‌, రారు బరేలీ, ఉంచాహర్‌ , సరేని. అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం తిలోయి, సలోన్‌, జగదీష్‌పూర్‌, గౌరీగంజ్‌ , అమేథీ అసెంబ్లీ సెగ్మెంట్‌లను కలిగి ఉంది. 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురికి ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఇద్దరు బీజేపీకి మద్దతు పలికారు. సాంప్రదాయకంగా ఎస్పీ ఎప్పుడూ పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నిశ్శబ్దంగా మద్దతునిస్తుంది, గాంధీ కుటుంబానికి అండగా నిలుస్తోందని ఎస్పీ శ్రేణులు అంటున్నాయి. అయితే ఈసారి రెండు పార్టీల మధ్య ప్రకటిత పొత్తు ఉండడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం కనిపిస్తోంది.
ఏదైనా ర్యాలీ లేదా కార్నర్‌ మీటింగ్‌లో రెండు పార్టీల కార్యకర్తలు మమేకమవుతున్నారు. గౌరీగంజ్‌ లోని కాంగ్రెస్‌ కార్యాలయం ప్రధాన గేటుపై రెండు పార్టీల జెండాలు ఉన్నాయి. ఆ కార్యాలయంలో ఎక్కడ చూసినా రెండు పార్టీల జెండాలే దర్శనమిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లేదా కిషోరి లాల్‌ శర్మ లేదా ఇతర కాంగ్రెస్‌ నాయకులు ప్రసంగించే ఏదైనా కాంగ్రెస్‌ బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో ఎస్పీ కార్య కర్తలు హాజరవుతారు. ఇది కేవలం పార్టీ ఆఫీస్‌ బేరర్లు, కార్యకర్తలకే పరిమితం కాలేదని తెలుస్తోంది. మద్దతు దారులు కూడా పొత్తుపై ఉత్సాహంగా ఉన్నారు. అమేథీలోని షాఘర్‌ గ్రామానికి చెందిన కమలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ తాను అఖిలేశ్‌ యాదవ్‌కు గట్టి మద్దతుదా రునని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందున తన ఓటు, మద్దతు కాంగ్రెస్‌కేనని అన్నారు. యాద వులందరూ ఈసారి ఏకమయ్యారు. పోయినసారి కొందరు బీజేపీకి ఓటేసి ఉండవచ్చు కానీ ఈసారి అఖిలేశ్‌ జీ మమ్మల్ని ఓటు వేయమని కోరిన చోటే ఓటు వేస్తామని ఆయన చెప్పారు. మద్దతు దారులు కూడా పొత్తుపై ఉత్సాహంగా ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో బ్రాహ్మణ, యాదవుల జనాభా గణనీయంగా ఉంది. రారుబరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌పై రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా, గాంధీ కుటుంబ సన్నిహితుడు లాల్‌ శర్మ అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు మే 20న ఐదో దశ పోలింగ్‌ జరగనుంది.

Spread the love