గాడ్సే వారసుల చేతుల్లో భారత్‌

India in the hands of Godse's descendants– తీవ్రవాదుల్లా బీజేపీ నాయకుల వ్యాఖ్యలు
– రాహుల్‌ది దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం
– ఆయనకు వస్తున్న ఆదరణ ఓర్వలేకే ఆరోపణలు : హన్మకొండలో టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ -హన్మకొండ చౌరస్తా
బీజేపీ నాయకులు తీవ్రవాదుల్లా మాట్లాడుతున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాహుల్‌ గాంధీదని టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ జిల్లా అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మాట్లాడుతూ.. గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయకుండా తీవ్రవాదుల్లా బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే ప్రధాని మోడీ, మంత్రి అమిత్‌ షా.. చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ ఆషామాషీ వ్యక్తి కాదని, ప్రధాని కావాల్సిన వ్యక్తిని పట్టుకొని.. నాలుక కోస్తా అనడమే కాక, టెర్రరిస్టుగా ముద్రవేయడం దారుణమన్నారు. ఆనాడు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ వాళ్ళ సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసం ప్రాణాలు త్యాగం చేయలేదని, టెర్రరిస్టులను అదుపుచేసే క్రమంలో తమ ప్రాణాలనే పణంగా పెట్టారని గుర్తు చేశారు. మోడీ ఏ రోజైన దేశం కోసం జైలుకు వెళ్లిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. దేశంలో రాహుల్‌కి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక బీజేపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని విమర్శించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీని అవమానిం చడమే కాక, రాహుల్‌ గాంధీని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. బీజేపీ ఎంపీలు ఉగ్రవాదుల్లా మాట్లాడుతుంటే ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాహుల్‌ గాంధీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మహిళా నాయకులు రహీమున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.

Spread the love