చీకట్లోకి భారతం..

లా కమిషన్‌ సిఫారసులు తిరోగమనమే
– రాజద్రోహ చట్టంపై న్యాయ నిపుణుల మనోగతం
స్వాతంత్య్రానంతరం మరింత వెలుగులోకి ప్రయాణించాల్సిన ఆధునిక భారతావని ఇప్పుడు చీకటిలో దారి వెతుకుతోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పరిస్థితి దాపురించడం ఓ విషాదం. బ్రిటీష్‌ పాలన కాలం నాటి రాజద్రోహ చట్టంలోని ఐపీసీ సెక్షన్‌ 124-ఏను కొనసాగించాలని, దానిలో నిర్దేశించిన శిక్షను పెంచాలని లా కమిషన్‌ చేసిన సూచనను గమనించిన వారు ఎవరైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సిఫారసులు అమలు చేస్తే భారత్‌ 19వ శతాబ్డం దిశగా తిరోగమనంలోకి సాగుతుందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై ఉక్కుపాదం మోపడానికి అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం రాజద్రోహ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని జాతీయోద్యమ కాలంలోనే దేశం ముక్తకంఠంతో నిరసించింది. అయినా అది నేటికీ కొనసాగటం అమానుషమని దేశం ఘోషిస్తస్త్రంటే..ఈ రాజద్రోహ చట్టానికి మరింత పదును పెట్టాలని సూచిస్తోంది.
విభిన్న అర్థాలతో…
ప్రస్తుత లా కమిషన్‌ ఇప్పటి వరకూ కేవలం మూడు నివేదికలను మాత్రమే ప్రచురించింది. రాజద్రోహ చట్టాన్ని కొనసాగించాలన్న సిఫార్సు వాటిలో ఒకటి. బ్రిటిష్‌ పాలనలో ఇందులోని నిబంధనలను అప్పటి జాతీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత ఇప్పుడూ కొనసాగుతోంది. సెక్షన్‌ 124-ఏ అమలును సుప్రీంకోర్టు నిలిపివేసినప్పటికీ దానికి మరింత పదును పెట్టాలని లా కమిషన్‌ సిఫార్సు చేయడం గమనార్హం. పౌరుల ప్రయోజనాలను, వారి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు అభిప్రాయాలకు లా కమిషన్‌ వక్రభాష్యం చెప్పింది. ప్రభుత్వంపై అవిధేయత ప్రదర్శించడం, ఇష్టపడకపోవడం, ద్వేషించడం, నష్టం కలిగించడం, దురుద్దేశం వంటి పదాలకు
తనదైన అర్థాన్ని చెప్పింది.
శిక్ష పెంపుపై మౌనమే సమాధానం
రాజద్రోహ చట్టంపై కొంతకాలంగా దేశంలో జరుగుతున్న చర్చలను లా కమిషన్‌ ఏ మాత్రం పట్టించుకోలేదు. అంతేకాక వివాదాస్పద మార్పులపై సమాంతరంగా వాదనలు లేవనెత్తింది. రాజద్రోహ చట్టాన్ని మరింత విస్తృతంగా అర్థం చేసుకుంటే అది రాజ్యాంగ పరీక్షకు నిలవబోదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యను కూడా కమిషన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. హింసను ప్రేరేపించే ఉద్దేశం ఉన్నా, ప్రజల అసమ్మతికి ఊతమిచ్చినా ఆ పనులకు విధించే శిక్షను పెంచాలని సూచించింది. నేరాన్ని నిరూపించే బాధ్యత నుంచి ప్రభుత్వాన్ని తప్పించింది. సెక్షన్‌ 124-ఏలో నిర్వచించిన శిక్షలోని ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ ఐదవ లా కమిషన్‌ నివేదికను ఉదహరించింది. రాజద్రోహ నేరానికి పాల్పడితే జీవిత ఖైదు విధించవచ్చునని, లేదా మూడేండ్ల జైలు శిక్షతో సరిపెట్టవచ్చునని ఆ నివేదిక సూచించింది. అయితే తాజా సిఫారసు ప్రకారం జీవిత ఖైదు విధించవచ్చు. లేదా ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. అయితే శిక్షను మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించలేదు. లా కమిషన్‌ సిఫారసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇతర తీర్పులకు అనుగుణంగా లేవు. వలసవాదుల పాలన నాటి ‘విధేయత’ సిద్ధాంతం కొనసాగింపే రాజద్రోహ చట్టం ఉద్దేశం. లా కమిషన్‌కు మాత్రం ఇదేమీ పట్టడం లేదు.
2014 తర్వాతే అధికం
లా కమిషన్‌ తాజా సిఫారసుల ప్రకారం ప్రాథమిక డిమాండ్లపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు నిరసన ప్రదర్శనలు జరిపినా, రోడ్లను దిగ్బంధించినా అది రాజద్రోహ చట్టం పరిధిలోకే వస్తుంది. ఆర్టికల్‌ 14 ప్రకారం… పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో 25 రాజద్రోహ కేసులు, హత్రాస్‌ సామూహిక లైంగికదాడి ఘటన తర్వాత 22 కేసులు, రైతుల ప్రదర్శనల సమయంలో ఆరు, పుల్వామా దాడి తర్వాత 27 రాజద్రోహ కేసులు నమోదయ్యాయి. దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణ కోసం ఈ చట్టం అవసరమేనని కమిషన్‌ నొక్కి చెప్పింది. రాజద్రోహ చట్టం కింద నమోదైన కేసులలో 96% కేసులు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవే.

Spread the love